విస్తరణ పూర్తి చేయాలి
‘దక్షిణ అయోధ్య’ను గోదావరి పుష్కరాల నాటికి సిద్ధం చేయాలి
అధికారులను ఆదేశించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
భద్రాచలం, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): దేశంలోనే కాదు ప్రపంచమంతటికి ‘దక్షిణ అయోధ్య’గా పేరుగాంచిన భద్రాచలం రామాలయా మాడవీధుల విస్తరణ పనులు ఆగమ శాస్త్ర ప్రకారం వేగవంతం జరగాలని, గోదావరి పుష్కరాల నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయం త్రం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి మాడవీధుల డిజైనింగ్ పనులను ఆర్కిటెక్ బృందం వారితో పూర్తిస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో భక్త రామదాసు నిర్మించిన సీతారామచంద్రస్వామి దేవస్థానం భక్తులకు అనుగుణంగా అభివృద్ధి జరగలేదన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి అభివృద్ధికై రూ.351 కోట్ల రూపాయలు మొదటి విడతగా విడుదల చేసి శ్రీరామనవమి రోజు శంకుస్థాపన చేసి, మాడవీధుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. మాడవీధుల నిర్మాణానికి ఒక ఎకరం 28 గుంటల భూమి సేకరించామని చెప్పారు.
దేవస్థానం ప్రాంగణంలో అధికారులతో సమావేశం నిర్వహించి పనులు శాస్త్రోక్తంగా జరపాలని, భక్తులకు విశాలవంతంగా ఉండేలా మాడవీధులలో పుట్‌పాత్ లు ఏర్పాటు చేయాలని, డిజైన్ పూర్తిస్థాయిలో కాంక్రీట్ వాడకాన్ని తగ్గించి రాతి, మెటల్ ఉపయోగించి కట్టడాలు నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. మాడవీధుల విస్తరణకు సంబంధించిన టెండర్ల పనులు పూర్తి కావాలని, అవసరమైతే ఆర్కిటిక్ సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం పూర్తిస్థాయిలో మాడ వీధుల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, ఐటీడీఏ పీవోబి రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట, దేవస్థానం ఈవో దామోదర్ రావు, ఏఎస్‌పి విక్రాంత్ కుమార్ సింగ్, తహశీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, సర్పంచ్ పూణెం కృష్ణ దొర, ఆర్కిటెక్ డిజైనర్ సూర్యనారాయణ బృందం, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.






