26 April, 2026 | 3:29 AM

ప్రజల కోసమే ‘ప్రజాదర్బార్’

26-04-2026 02:04 AM

క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

పాలేరులో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఖమ్మం, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నదే ప్రజా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పాలేరు నియోజకవర్గంలో చేపట్టిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమాన్ని శనివారం రాయిగూడెం క్లస్టర్ పరిధిలో నిర్వహించారు. రాయిగూడెం, అజయ్‌తండా, చెరువు మాదారం, మంగాపురం తండా, అప్పల నరసింహపురం, బుద్ధారం, కట్టుకాచారం, కొంగర, రాజారాంపేట, భైరవునిపల్లి గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలతో మంత్రి పొంగులేటి ముఖాముఖి భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రజలు తమగోడు చెప్పుకునేందు కు సరైన వేదిక లేక ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రజల కష్టాలను చిత్తశుద్ధితో విని పరిష్కరించే సత్తా ఉంది కాబట్టే ధైర్యంగా మీ మధ్యకు రాగలుగుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రజాదర్బార్‌ను కేవలం ఒక క్లాస్ రూమ్‌ల భావించొద్దని అధికారుల ద్వారా సమస్యలను లోతుగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. రాజకీయాలకతీతంగా అడి గిన పని ప్రజలకు ఉపయోగపడేదైతే తప్పకుండా పూర్తిచేస్తామన్నారు.

ఈ నియోజకవర్గంలో చేస్తున్న ప్రయోగం రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయడానికి ఒక నమూనాగా నిలుస్తుందని మంత్రి ఆకాంక్షించారు. 27 నుంచి శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రజాశీస్సులే తన బలమని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు.