31 March, 2026 | 3:52 AM

బండి చేసిన అభివృద్ధి ఎక్కడ?

03-05-2024 01:56 AM

గెలిచాక నియోజకవర్గంలో తిరగలేదు

ఇప్పుడు రాముడి ఫొటోలతోరాజకీయం చేస్తున్నారు

బీఆర్‌ఎస్, బీజేపీలకు ఓటు వేసి వృథా చేసుకోవద్దు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం

రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్

హుజూరాబాద్, మే 2 (విజయక్రాంతి): కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ, ఐదేళ్లు ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చూపించి ఓట్లు అడగాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అలా కాకుండా రాముడి ఫొటోతో రాజకీయం చేయడమేంటని ప్రశ్నించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం నాగంపేట గ్రామంలో గురువారం పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌తో కలిసి పొన్నం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నాగంపేట సర్కిల్‌లోని రోడ్ షోలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని అన్నారు. ఆరు గ్యారెంటీల గురించి ప్రశ్నించే ఇదే బీజేపీ నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.

సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు, రైతులకు పెన్షన్ ఇస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ విభజన హామీలు అమలు చేయలేకపోగా నల్ల చట్టాలను తెచ్చి ఇబ్బందులు పెడుతున్నారని బీజేపీపై నిప్పులు చెరిగారు. ఇప్పుడు ఓట్ల కోసం ప్రజల ముందుకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారో అంతర్మథనం చేసుకోవాలన్నారు. ఐదేళ్ళు ఎంపీగా ఉన్న బండి సంజయ్ నియోజకవర్గంలో తిరగలేదని, ఎలాంటి అభివృద్ధి చేయకుండా అక్షింతలు పంచి, రాముడి ఫొటో ముందుంచి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు జమ్మికుంట మండలానికి మోడల్ స్కూల్ తెచ్చానని, కస్తూర్బా పాఠశాలను, రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫైర్ స్టేషన్, తిరుపతి రైలును తెచ్చానని, బోర్లు వేశామని, బ్రిడ్జి పూర్తి చేశామని అన్నారు. పని చేయడానికి ధైర్యం ఉండాలన్నారు. వెలిచాల రాజేందర్‌రావు చదువుకున్న వ్యక్తి అని, గొప్ప ఆలోచనలు, పని చేసే సత్తా ఉందని, దీనికి తోడు వెంట మేమున్నామని అన్నారు. 7 నియోజకవర్గాలలో నలుగురం ఎమ్మెల్యేలం ఉన్నామని, ఎంపీగా రాజేందర్‌ను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి అన్నారు. 

2004 మధ్య ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశామన్నారు. బీఆర్‌ఎస్ లాగా డబుల్ బెడ్రూంలను పెండింగ్‌లో పెట్టలేదని, దళితులకు 3 ఎకరాలు అని మోసం చేయలేదని, ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆర్టీసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం అందిస్తున్నామని, రూ. 500లకే గ్యాస్ అందిస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికలు కాగానే రేషన్ కార్డులు అందజేస్తామని, నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తామని, ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద 5 లక్షలు ఇస్తామని, ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ, 10 ఏళ్లలో పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్నవారికి కొత్త పెన్షన్‌లు ఇస్తామన్నారు. పెన్షన్‌ను 4వేలకు పెంచుతామని, వచ్చే వర్షకాలం పంటకు 500 బోనస్ ఇస్తాం అన్నారు.

ప్రజలంతా ఆలోచించాలని బీఆర్‌ఎస్, బీజేపీలకు ఓటు వేసి వృథా చేసుకోవద్దని, ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేసే కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పేపర్- ఫెయిల్ అయిన వొడితల ప్రణవ్‌ను పేపర్ -2లో గెలిపించాలని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు. దేశంలో 30 ఏళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన బీజేపీ రాజ్యాంగం మార్చి ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తీసేసి అంబేడ్కర్ విగ్రహాలను కూల్చే కుట్రలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మి రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పత్తి కృష్ణారెడ్డి,గూడెపు సారంగపాణి, ఎక్కటి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.