25-05-2025 10:33:14 PM
మహాదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరంలో సరస్వతి పుష్కరా(Saraswati Pushkaralu)ల్లో అట్టహాసంగా 11వ రోజు సరస్వతి నవరత్న మాలా హారతిలో భక్తజనం పెద్ద ఎత్తున హాజరయ్యారు. సరస్వతి పుష్కరాల్లో భాగంగా సరస్వతి ఘాట్ వద్ద 11వ రోజు నిర్వహించిన సరస్వతి నవరత్న మాలా హారతి మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రకాశవంతమైన దీపాల వెలుగులో త్రివేణి సంగమం దేవమందిరంలా మెరిసింది. కాశీ పూజారులు వేదఘోషల మధ్య హారతిని నిర్వహించారు. ఈ మహామంగళ హారతిని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మంత్రముగ్ధులయ్యారు.
సరస్వతి నవరత్న మాల హారతిలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామాణాభి వృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ... ఈ పుణ్య ఘడియలు అందరికీ శ్రేయస్సును, శుభాన్ని కలిగించాలని, సరస్వతి అమ్మవారి కృపతో మన తెలంగాణ అభివృద్ధి బాటలో పయనించాలని అమ్మవారిని ప్రత్యేకంగా పూజించినట్లు తెలిపారు. కార్యక్రమాన్ని ఆసాంతం దిగ్విజయంగా నిర్వహిస్తన్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీ కృష్ణ, భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్య నారాయణ రావు, సీఎంఓ కార్యదర్శి శ్రీనివాస రాజు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.