21 July, 2026 | 9:06 PM

మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు బిజీబిజీ

21-07-2026 05:50 PM

బాధిత కుటుంబాలకు పరామర్శలు

మంథని అభివృద్ధి పనుల పై ప్రత్యేక పర్యవేక్షణ

రెండు రోజుల పాటు మంథని నియోజకవర్గంలో ఐటీ శాఖ మంత్రి విస్తృత పర్యటన

గోదావరి పుష్కర ఏర్పాట్లు, 100 అడుగుల రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన

మంథని,(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గడిచిన రెండు రోజులుగా తన సొంత నియోజకవర్గమైన మంథనిలో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపారు. ఒకవైపు బాధిత కుటుంబాలను పరామర్శించి కొండంత ధైర్యాన్ని ఇస్తూనే, మరోవైపు మంథని పట్టణ సమగ్ర అభివృద్ధి పనులు, రాబోయే గోదావరి పుష్కరాల ముందస్తు ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలనలు జరుపుతూ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

బాధిత కుటుంబాలకు కొండంత భరోసా

పర్యటనలో భాగంగా సోమవారం ముత్తారం మండలంలో మంత్రి శ్రీధర్ బాబు విస్తృతంగా పర్యటించారు.  కేశనపల్లి గ్రామంలో మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం తండ్రి స్వర్గీయ లింగయ్య నివాసానికి వెళ్ళి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆపదలో ఉన్నవారికి అండగా ముత్తారం మండలం, మంథని పట్టణ పరిధిలోని పలు గ్రామాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను నేరుగా కలిసి ఆత్మీయంగా మాట్లాడారు. ప్రభుత్వం మీకు ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

సువర్ణ వనమాల అంత్యక్రియల్లో

మంగళవారం ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు సోదరి, మంథని మాజీ సర్పంచ్ స్వర్గీయ సువర్ణ చంటయ్య సతీమణి సువర్ణ వనమాల అంత్యక్రియలకు హాజరై అశ్రునయనాలతో నివాళులర్పించి శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు.

మంథని అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి

మంథని పట్టణ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించి మంత్రి సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి పనుల పురోగతిపై శ్రీధర్ బాబు నిరంతర అధికారులతో పర్యవేక్షణ కొనసాగించారు.

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష

 మంథని గోదావరి తీరాన్ని సందర్శించిన మంత్రి, రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.

మంథనిలో 100 అడుగుల రహదారి పరిశీలన

 మంథని పట్టణంలో పాత పెట్రోల్ బంక్ నుంచి బస్ డిపో వరకు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 100 అడుగుల ప్రధాన రహదారి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. నాణ్యతలో రాజీ పడకుండా, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు.

ప్రజల మెప్పు పొందుతున్న నాయకత్వం

నిరంతరం ప్రజా క్షేత్రంలో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడంతో పాటు, నియోజకవర్గ రూపురేఖలు మార్చే అభివృద్ధి పనులను పరుగులు తీస్తున్న మంత్రి శ్రీధర్ బాబు పనితీరుపై స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రజాసేవ - అభివృద్ధే లక్ష్యంగా సాగుతున్న ఆయన పర్యటన మంథనిలో ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది.