అన్ని దారులు నేడు కాళేశ్వరం వైపే..
నేడు కాటారంలో సీఎం భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి
దగ్గరుండి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు
మంథని ఏప్రిల్ 19 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రహదారులు నేడు కాళేశ్వరం బాట పట్టనున్నాయి. మంథని నియోజకవర్గంలోని భూపాలపల్లి జిల్లా కాటారంలో సోమవారం సాయంత్రం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఏర్పాట్లను దగ్గరుండి స్వయంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పరిశీలించారు.
ఈ సభ ద్వారా రాష్ట్రంలో రైతులు ఆశగా ఎదురుచూస్తున్న రైతుబంధు రెండో విడత నిధులు రూ. 5,653 వేలకోట్లు రైతుల ఖాతాల్లో వేయనున్నారు. అలాగే ముఖ్యమంత్రి బహిరంగ సభకు జనం అధిక సంఖ్య లో రానుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జన సమీకరణలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, జగిత్యాల, ధర్మపురి, వేములవాడతో పాటు భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల నుండి ప్రజలు రైతులు అధికంగా తరలిరానున్నట్లు తెలుస్తుంది. ఈ సభ విజయవంతం చేసేందుకు మంత్రి శ్రీధర్ బాబు దగ్గరుండి స్వయంగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. నీ బహిరంగ సభను పరిరక్షించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాటారం చేరుకున్నారు.






