రెండో దఫా రైతు భరోసా
- నేడు భూపాలపల్లి జిల్లా నస్తురుపల్లిలో సభ
సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
రైతుల ఖాతాల్లో 5,563 కోట్లు జమ
మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలించనున్న ముఖ్యమంత్రి
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల
మహబూబాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): రైతుల సమక్షంలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి రైతు భరోసా కింద రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రూ. 5,563 కోట్లను విడుదల చేయనున్న ట్లు వ్యవసాయ, సహకార, జౌళి, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఆదివా రం భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలో సోమవారం జరగనున్న రైతు భరోసా నిధుల విడుదల బహిరంగ సభను మంత్రులు కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాష్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి భారత దేశంలో లక్షా 10 వేల కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిధులు, నీళ్లు, నియామకాల మీద ఏర్పడిన గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభు త్వం తరతరాలకు ఉపయోగపడేలా నివేదికల ఆధారంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపా రు. కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం అభివృద్ధికి రూ.200 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఇచ్చిన మాటలకు అనుగుణంగా ప్రతి ఎకరాకు సంవత్సరానికి రెండు దఫాలుగా రూ.12,000 వేల రైతు భరోసా విడుదల చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని తెలిపారు.
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తదుపరి 73 లక్షల మంది రైతులకు కోటి 15 లక్షల ఎకరాలకు రైతుభరోసా నిధులు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రైతుసోదరులకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత రైతుభరోసా నిధులను సీఎం రేవంత్‌రెడ్డి కాటారం మండలం నస్తురుపల్లి నుంచి చేయనున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వం రైతులకు రుణమాఫీ, వ్యవసాయ పనిముట్లు, రైతు భరో సా, సన్నవడ్లకు క్వింటాళ్లుకు రూ.500 బోన స్ చెల్లిస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి సోమవారం కాళేశ్వరం సందర్శించి స్వామిని దర్శించుకుంటారని, కాళేశ్వరం అభివృద్ధికి సంబంధించిన రూ.200 కోట్లతో చేపట్టిన మాస్టర్ ప్రణాళిక కార్యక్రమానికి భూమిపూజ, శిలాఫలకం ఆవిష్కరణ తదుపరి, మేడిగడ్డ సందర్శన ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి, సహచర మంత్రులు పాల్గొననున్నట్లు తెలిపారు.
డ్యామ్ సేఫ్టీ అధికారులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జలవనరుల సంఘం నివేదపై సమీక్ష నిర్వహించను న్నట్లు తెలిపారు. ప్రజల సొమ్ము ను సద్వినియోగం చేసి ప్రాజెక్టు ఉపయోగపడాలన్న ఆలోచనతో ఉన్నామని తెలిపారు. సీఎం ఈ ప్రాంతానికి రావడం, రైతు భరోసా నిధులు చేయడం ఈ ప్రాంతానికి ఎంతో గర్వకారణమని రైతులు అధిక సంఖ్య లో పాల్గొని కార్యకమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబా బు పాల్గొన్నారు.
నేడు సీఎం పర్యటన ఇలా..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం మధ్యాహ్నం 1.45 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి 2.00 గంటలకు బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికా ప్టర్ ద్వారా 3.00 గంటలకు కాళేశ్వరం ఆలయానికి చేరుకుంటారు. 3.05 నుంచి 3.25 గంటల మధ్య శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని, ఆలయంలో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. 3.30 గంటలకు కాళేశ్వరం నుంచి బయలుదేరి 3.45 గంటలకు మహాదేవపూర్ మండలం మేడిగడ్డకు చేరుకుంటారు.
అక్కడ 3.45 నుంచి 4.30 గంటల వరకు మేడిగడ్డ బరా జ్ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. 4.35 నుంచి 5.30 గంటల వరకు అంబట్పల్లి గెస్ట్ హౌ స్‌లో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం 5.35 నుంచి 6.00 గంటల వరకు మీడియా సమావేశంలో పాల్గొంటారు. 6.00 గంటలకు మేడిగడ్డ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 6.30 గంటలకు కాటారం మండలం నస్తూరపల్లి గ్రామానికి చేరుకుంటారు.
అక్కడ 6.30 నుంచి 7.45 గంటల వరకు రైతు భరోసా పథకం రెండో విడత నిధులను విడుదల చేస్తారు. తదుపరి 7.45 గంటలకు నస్తూరపల్లి నుంచి బయలుదేరి రాత్రి 11.15 గంట లకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.






