ఆమోదించండి
- గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా మంత్రి అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం
గవర్నర్‌కు సిఫారస్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): గవర్నర్ కోటాలో పెండింగ్‌లో ఉన్న రెండు ఎమ్మెల్సీల పేర్లను ఆమోదించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు విజ్ఞప్తి చేశా రు. ఈ మేరకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా మంత్రి అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం పేర్లను ప్రభుత్వం సిఫారస్ చేసిన విషయం తెలిసిందే. లోక్‌భవన్‌లో గవర్నర్ శుక్లాను సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి శ్రీధర్‌బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిలో కలిశారు.
ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఎమ్మెల్సీ నామినేషన్లపై జరిగినట్లు సమాచారం. ప్రధానంగా మంత్రి మహ్మద్ అజారుద్దీన్ భవిష్యత్‌ను దృష్టి లో ఉంచుకుని ఈ భేటీ అత్యంత కీలకం గా మారింది. తెలంగాణ క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ పదవికి సం బంధించి సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు నెలల లోపు ఏదో ఒక సభ (అసెంబ్లీ లేదా కౌన్సిల్)లో సభ్యుడిగా ఎన్నిక కావాలి. అజారుద్దీన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఈ నెల 30 నాటికి సరిగ్గా ఆరు నెలలు పూర్తి కానున్నాయి. అంటే.. మరో పదిరోజుల్లో ఆయన చట్టసభ సభ్యుడిగా ఎన్నిక కాకపోతే మంత్రి పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి ఈ నెల 30వ తేదీ లోపు ఈ ఫైల్‌పై గవర్నర్ ఆమోదం తెలిపి, గెజిట్ విడుదల అయితేనే అజారుద్దీన్ మంత్రిగా కొనసాగే అవకాశం ఉంది.
అందుకు సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్‌ను స్వయంగా కలిసి, తాజా రాజకీయ పరిణామాలను వివరించినట్లు సమాచారం. అయితే ఈ సందర్భంగా విద్యారంగానికి సంబంధించి వివిధ అంశాలపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించా రు. జూన్ 12 న ఎల్బీస్టేడియంలో గవర్నర్ ఆధ్వర్యంలో చేపట్టనున్న అవగాహన కార్యక్రమంపై చర్చించారు.
విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు. ఇందుకు సంబంధించి విద్యార్థులతో ప్రమాణం చేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్ల సమయంలోనే మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణపత్రం తీసుకోవాలని గవర్నర్ సూచించారు. గవర్నర్ సూచనలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.






