7 June, 2026 | 2:00 AM

పోచంపల్లి ఇక్కత్ మనకు గర్వకారణం

07-06-2026 12:00 AM

ప్రపంచ చిత్రపటంలో ప్రత్యేక స్థానం

చేనేత కార్మికుల అభివృద్ధికి అండగా ప్రభుత్వం 

‘త్రెడ్ పోచంపల్లి’ ప్రదర్శనలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళాత్మక నైపుణ్యానికి ప్రతీకగా నిలిచిన పోచంపల్లి ఇక్కత్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందడం ప్రతి తెలంగాణవాసికి గర్వకారణమని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహిస్తున్న త్రెడ్ పోచంపల్లి ప్రత్యేక ప్రదర్శనలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. పోచంపల్లి ఇక్కత్ కేవలం ఒక వస్త్ర కళ మాత్రమే కాదని, అది తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సృజనాత్మకత, సంప్రదాయ జీవన విధానానికి అద్దం పట్టే అద్భుత కళారూపమని అభివర్ణించారు.

రంగుల సమన్వయం, నూలు పోగుల్లో కనిపించే అపూర్వమైన డిజైన్లు, తరతరాలుగా వస్తున్న కళాత్మక నైపుణ్యం వల్ల పోచంపల్లి ఇక్కత్ ప్రపంచ ఫ్యాషన్ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని చెప్పారు. చేనేత కార్మికుల కష్టం, పట్టుదల, నైపుణ్యం వల్లే పోచంపల్లి పేరు ప్రపంచ పటంలో నిలిచిందని మంత్రి కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు.

చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సంక్షేమ కార్యక్రమాలు, మార్కెటింగ్ అవకాశాలు, ఆర్థిక సహాయం, శిక్షణ కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మరింత గుర్తింపు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. చేనేత ఉత్పత్తుల అమ్మకాల పెరుగుదల ద్వారా వేలాది కుటుంబాలకు ఉపాధి భద్రత కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.

పోచంపల్లి ఇక్కత్కు లభించిన జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ తెలంగాణ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిందని మంత్రి అన్నారు. భారతదేశ చేనేత రంగ చరిత్రలో పోచంపల్లి ఇక్కత్‌కు ప్రత్యేక అధ్యాయం ఉందని పేర్కొన్న మంత్రి, ఈ కళను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. యువత కూడా చేనేత రంగం వైపు ఆకర్షితులయ్యేలా ఆధునిక డిజైన్లు, కొత్త మార్కెటింగ్ విధానాలు, డిజిటల్ వేదికల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

త్రెడ్ పోచంపల్లి వంటి ప్రదర్శనలు చేనేత కళాకారుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు, కొనుగోలుదారులు, డిజైనర్లు, వ్యాపారవేత్తలు, కళాభిమానులను ఒకే వేదికపైకి తీసుకువస్తాయని ఆయన తెలిపారు. తెలంగాణ చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేసి, ప్రపంచ మార్కెట్లలో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.