నేడు ఢిల్లీకి మంత్రి ఉత్తమ్
- కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శితో భేటీ
- పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించే అవకాశం
- ఉదయం ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో డిప్యూటీ సీఎం భట్టితో కలిసి ఉత్తమ్ పర్యటన
- దేవాదుల, సీతారామ ప్రాజెక్టులపై సమీక్ష
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శితో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది. అయితే ఢిల్లీ పర్యటనకు ముందే ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటిస్తారు. రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల పనులను పరిశీలించనున్నారు. హెలికాప్టర్‌లో దేవాదుల ఎత్తిపోతల పథకం ఆఫ్ టేక్ పాయింట్, పంపింగ్ స్టేషన్‌ను సందర్శించి ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు.
అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ సాగర్ ప్రాజెక్టు ఆఫ్ టేక్ పాయింట్‌ను పరిశీలిస్తారు. అక్కడ జరుగుతున్న పనులు, నీటి వినియోగం, నిర్మాణ పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో ప్రాజెక్టుల నిర్మాణ వేగం, పెండింగ్ పనులు, నీటి సరఫరా అంశాలపై అధికారులకు పలు సూచనలు చేసే అవకాశం ఉంది. జిల్లాల పర్యటన ముగిసిన అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని, అక్కడి నుంచి విమానంలో న్యూఢిల్లీకి బయలుదేరనున్నారు. సాయంత్రం కేం ద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శితో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఈ భేటీలో తెలంగాణకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, కేంద్ర ప్రభు త్వ అనుమతులు అవసరమైన అంశాలు, కేంద్ర నిధుల విడుదల, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ ప్రతిపాదనలు, అంతర్రాష్ట్ర జల వివాదాలు, ఇతర నీటిపారుదల అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పనులు, కేంద్ర సహకారం అవసరమైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్ర జల్ శక్తి శాఖ అధికారులతో చర్చల అనంతరం తదుపరి కార్యా చరణపై నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.






