13 July, 2026 | 2:27 AM

రక్తదాహం తీరలేదా!

13-07-2026 01:34 AM

60 ఏళ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగింది సరిపోలేదా?

  1. తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి
  2. మా రక్తం ఎంత కావాలన్నా ఇస్తాం.. కానీ రైతులకు నీళ్లివ్వండి
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటవా..? రక్త పిశాచీ.. ఇంకా మీ రక్తదాహం తీరలేదా సీఎం రేవంత్‌రెడ్డీ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా.. సరిపోలే దా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి చేసిన రక్తం వ్యాఖ్యలపై కేటీఆర్ ఆదివారం ఎక్స్ వేదికగా ఘాటుగా స్పం దించారు. తెలంగాణ రక్తం రుచిమరిగిన తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలని ప్రశ్నించారు.

‘తెలంగాణ పిల్ల ల్ని పిట్టల్ని కాల్చిన ట్టు కాల్చిపారేసి ఎన్‌కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన నరహంతకులు మీరు. 1952లో ఏడుగురు యువకులను కాల్చిచంపి రక్తం కళ్ల జూసిన రాక్షసులు మీరు. 1969లో 369 మంది ముద్దుబిడ్డలపై తూటాలు కురిపించి రక్తం పారించిన ఖూనీకోర్లు మీరు. మలిదశ పోరాటంలో వేయిమందిని బలితీసుకున్న మృగాళ్లు మీరు’ అని ఆరోపిం చారు. కాంగ్రెస్ పార్టీ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిచినై.. కాంగ్రెస్ రక్కసి కోరలకు తెలంగాణ నెత్తుటి మరకలు అంటినై..

అని గుర్తుచేశారు. ‘నీకు మా రక్తం ఎంత కావాలంటే అంత పంపి స్తాం.. కానీ, నువ్వు రైతులకు నీళ్లు ఇవ్వు’ అని పేర్కొన్నారు. పేగులు తెగేదాకా రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్లం.. రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. నీళ్లలో నిప్పులు పుట్టించి జలసాధన పోరాటాలు చేసిన వాళ్లం.. నెత్తురు ఇస్తేనే.. నీళ్లు ఇస్తాం అని కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుంటే మా నెత్తురు ధారపోస్తామని వెల్లడించారు. మీ రక్తదాహం తీర్చుకొని.. ఎండుతున్న పొలాల జలదాహం తీర్చాలని డిమాండ్‌చేశారు.