8 May, 2026 | 2:07 PM

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుతో ప్రాణహిత జలాలకు వినియోగం: మంత్రి జూపల్లి కృష్ణారావు

08-05-2026 01:05 PM

కాళేశ్వరం పేరుతో ప్రజాధనం దోపిడీ చేశారని ప్రభుత్వంపై విమర్శలు

మంత్రి వివేక్ వెంకటస్వామి 

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 8 (విజయక్రాంతి): ప్రాణహిత నది జలాలను సముద్రంలో వృథా కాకుండా సాగునీటి అవసరాలకు వినియోగించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం అధికారికంగా తొలి అడుగులు వేస్తోందని వెల్లడించారు. శుక్రవారం తుమ్మిడిహెట్టి నిర్మాణ స్థలాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి జూపల్లి, తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు కాలువల ద్వారా  నీటిని తరలించే అవకాశం ఉందని, దీంతో విద్యుత్ ఖర్చు తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు.

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు కృంగిపోవడంతో అవి పూర్తిస్థాయిలో వినియోగంలో లేవని, దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పంపిన అధికారిక లేఖ నేపథ్యంలో, ప్రాజెక్టు ఎత్తు అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నెలాఖరులో ఫడ్నవీస్‌తో భేటీ కానున్నారని వెల్లడించారు.

తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణం అవసరమని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ మార్పుల కారణంగా ప్రాజెక్టు నిలిచిపోయిందని, మహారాష్ట్ర అనుమతితోనే పూర్తి స్థాయి నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద పెద్ద ఎత్తున గ్రామాలు ముంపునకు గురయ్యే పరిస్థితి లేదని, అవసరమైతే నష్టపరిహారం అందిస్తామని స్పష్టం చేశారు.మంత్రి వివేక్ వెంకటస్వామి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాణహిత ప్రాజెక్టును కావాలనే మేడిగడ్డ వైపు మళ్లించారని ఆరోపించారు. మాజీ సీఎం వై.ఎస్. రాజశేఖర రెడ్డి మూడు సార్లు ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించి, 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు.

152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మిస్తే మహారాష్ట్రలో కేవలం 5 వేల ఎకరాలు మాత్రమే ముంపునకు గురయ్యేవని, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టును దారి మళ్లించారని విమర్శించారు. మాజీ సీఎం కే. చంద్రశేఖర్ రావు ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును అవినీతి కోసమే నిర్మించిందని ఆరోపించారు. 60 టీఎంసీల నీటినే పూర్తిగా వినియోగించలేకపోయారని, భారీ అంచనాలతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. రైతులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం అందలేదని పేర్కొన్నారు.