19 August, 2026 | 10:22 AM

మణుగూరు ఐటీఐ–ఏటీసీ విద్యార్థుల ఆవిష్కరణలకు మంత్రి ప్రశంసలు

19-08-2026 09:38 AM

ఎలక్ట్రిక్ వాహనాలను -కమర్షియల్ వెహికల్స్‌గా అభివృద్ధికి సహకారం

119 ఏటీసీల విద్యార్థుల మధ్య ఇన్నోవేషన్ పోటీలు 

అత్యుత్తమ ప్రతిభకు అవార్డులు, ఉద్యోగాలు

మణుగూరు,(విజయక్రాంతి): మణుగూరు ఐటీఐ–అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ విద్యార్థుల నూతన ఆవిష్కరణలు అభినందనీయమని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనులు, భూగర్భ శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను మంత్రి పరిశీలించి అభినందించారు. పార్థసారథి, స్ఫూర్తి రూపొందించిన వాహనాల్లో పాత వాహనాల విడిభాగాలను పునర్వినియోగం చేయడాన్ని మంత్రి ప్రశంసించారు. వాటిని మరింత సాంకేతికంగా అభివృద్ధి చేసి కమర్షియల్ వెహికల్స్‌గా రూపొందించేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. విద్యార్థుల ప్రాజెక్టులను మార్కెట్‌లో ఉపయోగపడే ఉత్పత్తులుగా తీర్చిదిద్దేందుకు పరిశ్రమల సహకారం తీసుకుంటామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 119 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను టాటా సంస్థతో కలిసి అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఏటీసీ విద్యార్థుల మధ్య ఇన్నోవేషన్ పోటీలు నిర్వహించి అత్యుత్తమ ఆవిష్కరణలను గుర్తిస్తామన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మణుగూరు ఏటీసీలో శిక్షణ పొందుతున్న సుమారు 100 మంది విద్యార్థులకు టాటా సంస్థ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు.

టామ్‌కామ్ ద్వారా తెలంగాణ యువతకు జర్మనీ, జపాన్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. జర్మన్, జపనీస్ భాషల్లో శిక్షణ అందించి విదేశీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో యువత, యువ రైతుల కోసం ఆధునిక వ్యవసాయ సాంకేతిక కోర్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సాంకేతిక నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌ను కూడా అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మణుగూరులో ఐటీసీ సీఎస్‌ఆర్ నిధులతో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. ఈ కేంద్రం ద్వారా సుమారు 100 మంది యువతకు శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఆధునిక సాంకేతిక ఏటీసీ ఏర్పాటు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమన్నారు.

విదేశీ భాషలపై పట్టు సాధిస్తే అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చన్నారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్థానిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కోరారు. మణుగూరు ఏటీసీలో 244 మంది, ఐటీఐలో 168 మంది కలిపి మొత్తం 412 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. ఏటీసీలో శిక్షణ పూర్తి చేసిన 50 మంది విద్యార్థులకు అభినందన పత్రాలు అందజేశారు. ఏజెన్సీ విద్యార్థుల కోసం ఐటీఐ–ఏటీసీ వద్ద రెసిడెన్షియల్ హాస్టల్ ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా స్థానిక యువతకు శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సి ఎన్ సీ వంటి ఆధునిక కోర్సులకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక జాబ్‌మేళా నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మృనాల శ్రేష్ట, అధికారులు నగేష్, గౌస్ పాషా, కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్ సారంగపాణి, తహసీల్దార్ అద్దంకి నరేష్ తదితరులు పాల్గొన్నారు.