calender_icon.png 29 July, 2025 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డార్క్‌వెబ్‌లో మంత్రుల ఫోన్లు ట్యాప్

29-07-2025 02:48:00 AM

  1. ఖరీదైన సాఫ్ట్‌వేర్‌తో ట్యాపింగ్ చేయిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
  2. మంత్రుల ఫోన్లు ఫోరెన్సిక్ నిపుణులతో పరీక్షించాలి..
  3. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ వాంగ్మూలం
  4. సీఎంపై సంచలన ఆరోపణలు చేస్తూ రాతపూర్వక ఫిర్యాదు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్‌ఎస్ కీలక నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. జూలై 14న సిట్ నోటీసులకు స్పందించకపోవడంతో, మరోసారి నోటీసులు జారీ చేయగా, సోమవారం ఉదయం 11 గంటలకు ప్రవీణ్‌కుమార్ విచారణకు హాజరయ్యారు.

తన ఫోన్ ట్యాపింగ్‌పై వాంగ్మూలం నమోదు చేయడంతో పాటు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్‌రెడ్డి తన సొంత మంత్రుల ఫోన్లను, అలాగే ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని సిట్ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు సమర్పించినట్లు ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఈ ఆరోపణలకు మద్దతుగా రేవంత్‌రెడ్డి మాట్లాడిన వీడియో ఫుటేజ్‌ను కూడా అందించినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేవలం ఫోన్లను ట్యాప్ చేయడమే కాకుండా, డార్క్ వెబ్‌లో అత్యంత ఖరీదైన సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను ఉపయోగిస్తూ ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సైడ్ పోస్ట్ పత్రిక రాసిన విషయాన్ని ప్రవీణ్‌కుమార్ ప్రస్తావించారు. కాబట్టి, ఆ మంత్రులను కూడా విచారణకు సిట్ అధికారులు పిలిపించాలని డిమాండ్ చేశారు. ఆ మంత్రుల ఫోన్లను కూడా పరిశీలించాలని, ఫోరెన్సిక్ నిపుణులతో వాటిని పరీక్షించాలని కోరారు. వారి ఫోన్లలోకి ఏ విధంగా సాఫ్ట్‌వేర్ మాల్వేర్ పంపించారనే దానిపై పూర్తి విచారణ జరగాలన్నారు.

గతంలో చేసిన ఫిర్యాదుపై విచారణకు..

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేసిందని గతంలో ఎన్నికల కమిషన్‌తో పాటు నాటి డీజీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ విచారణలో ఇప్పటికే గుర్తించింది. రాజకీయాల్లోకి రాక ముందు పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో ప్రవీణ్ కుమార్ విధులు నిర్వర్తించారు.

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ సెక్రటరీగా పనిచేస్తూ 2021 జూలైలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి బీఎస్పీలో చేరారు. అప్పటి నుంచే ప్రణీత్ రావు బృందం ప్రవీణ్ కుమార్ కదలికలను బీఆర్‌ఎస్ పెద్దలకు తెలియజేస్తూ, ఆయన ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.