4 March, 2026 | 9:31 AM

ఆకాశంలో అద్భుతం!

04-03-2026 12:00 AM

’బ్లడ్ మూన్’ కనువిందు

హైదరాబాద్, మార్చి 3 : ఆకాశంలో మంగళవారం సాయంత్రం ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం కారణంగా జాబిల్లి నిప్పులు చిమ్ముతున్నట్లు ఎర్రగా మారిపోయింది. దీనినే ఖగోళ శాస్త్రవేత్తలు ‘బ్లడ్ మూన్’ అని పిలుస్తారు. సాధారణంగా తెల్లగా మెరిసిపోయే చంద్రుడు ఒక్కసారిగా రక్తపు రంగులోకి మారడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ అరుదైన దృశ్యాన్ని ప్రజలు ఎంతో ఆసక్తిగా చూశారు. భారతదేశంలో సాయంత్రం 5 గంటల 21 నిమిషాలకు గ్రహణం పూర్తి స్థాయిలోకి ప్రవేశించింది. సాయంత్రం 5 గంటల 58 నిమిషాలకు ఇది గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ సమయంలో చంద్రుడు భూమి నీడలోకి పూర్తిగా వెళ్లడం వల్ల ఎరుపు రంగులోకి మారాడు. సాయంత్రం 6 గంటల 23 నిమిషాల వరకు ఈ అద్భుతం కొనసాగింది. రాత్రి 7 గంటల 39 నిమిషాల వరకు చంద్రుడిపై భూమి నీడ పాక్షికంగా కనిపించింది.

భారతదేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఈ గ్రహణం స్పష్టంగా కనిపించింది.  కోల్‌కతా, గువహటి, సిలిగురి వంటి నగరాల్లో ప్రజలు బ్లడ్ మూన్‌ను తిలకించే అవకాశం లభించింది. పశ్చిమ భారత దేశంలోని నగరాలతో పోలిస్తే ఈ ప్రాంతాల్లో దృశ్యం మరింత స్పష్టంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా న్యూయార్క్, టోక్యో, సిడ్నీ వంటి నగరాల్లో కూడా ఈ అరుదైన గ్రహణం కనువిందు చేసింది.

ఈసారి గ్రహణంలో మరో అరుదైన విశేషం కూడా ఉంది. ఒకవైపు సూర్యుడు అస్తమిస్తూ ఉండగానే మరోవైపు ఎర్రటి చంద్రుడు ఉదయించాడు. దీనిని ’సెలెనెలియన్’ ప్రభావం అని పిలుస్తారు.  ఇది అసాధ్యమనిపించినా కాంతి వక్రీభవనం వల్ల ఈ అద్భుతం జరిగింది. 2026 సంవత్సరంలో తారసపడిన ఈ మొదటి గ్రహణం ఖగోళ ప్రియులకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది.