సత్యార్థ ప్రకాశమే నా గురువు
సాధారణంగా నేను పుస్తకావిష్కరణ కార్యక్రమాలతో పాటు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతుంటాను. ఒకసారి సికింద్రాబాద్‌లోని మేడి బావి ఆర్యసమాజానికి వెళ్లాను. 1937లో శ్రీరామభక్త సమాజంగా అవతరించిన ఆ సంస్థ 2008లో ఆర్యసమాజంగా మారి వివిధ వైదిక యజ్ఞ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. దీనికోసం ఒక ట్రస్టు ఏర్పాటు చేశారు 1989లో. ట్రస్టు వ్యవస్థాపకులుగా ఈ నాటికీ డాక్టర్ కోడూరి సుబ్బారావుగారే ఉన్నారు.
కోడూరి సుబ్బారావు ఈ ఆర్యసమాజానికి నిజానికి 1970లో వచ్చారు. వేద వాఙ్మ యాన్ని అధ్యయనం చేయడంతోపాటు, హోమియో వైద్యం నేర్చుకున్నారు. ‘మీరు ఏ వృత్తిలో గాక హోమియో వైద్య సేవారంగంలో స్థిరపడడానికి కారణం ఏమిటి?’ అని ప్రశ్నిస్తే, ‘నా శారీరక బలహీనత కారణంగా హోమియో వైద్యం నాకు తగిన వృత్తిగా భావించానని చెబుతారు. వారు మొదట సీతాఫల్‌మండి ఆర్యసమాజంలో హోమి యో వైద్యశాలను నడిపారు.
నా ముగ్గురు పిల్లలు సీతాఫల్‌మండి వైదిక్ స్కూల్ విద్యార్థులు. నేను ఆ పాఠశాలకు వెళ్లినప్పుడు కోడూరి సుబ్బారావుని కలిసేవాణ్ని. అలా వారితో నాకు పరిచయం ఏర్పడింది. ఒకరోజు నేనున్న బౌద్ధ నగర్‌లో కోడూరి సుబ్బారావుగారి వేద ప్రవచనం జరిగింది. దానికి నేను హాజరైనప్పుడు దయానంద సరస్వతి విరచిత ‘సత్యప్రకాశం’ ఇచ్చి చదవమన్నారు. బహుశా అది 1980 ప్రాంతం అయి ఉంటుంది. నేను మాత్రం ‘సత్యార్థ ప్రకాశం’ తెరిచిన పాపాన పోలేదు. నిజానికి సత్యార్థ ప్రకాశం చదివితే పాపం ఎందుకు వస్తుంది? పుణ్యమే వస్తుంది. ముఖ్యంగా సద్బుద్ధి కలుగుతుంది. మంచి పనులు చేయడంలో ఉత్సాహం పెరుగుతుంది. సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది. కానీ, ఆ ఉద్గ్రంథాన్ని తెరవలేదు, చదవలేదు. కానీ, దాన్ని నాకిచ్చిన డా.కోడూరి సుబ్బారావుని మాత్రం మరిచిపోలేదు.
నాకు 1995లో దర్శనతత్త వేత్తలైన పండిత గోపదేవశాస్త్రి గారితో పరిచయం కలిగింది. క్రమంగా వారికి నేను శిష్యుడినయ్యాను. వారిని ‘దక్షిణ భారతదేశపు దయా నందులు’ అని తెలుగువారు సగౌరవంగా పిలుచుకుంటారు. వారు నాకు రోజుకు 6 గంటల చొప్పున దర్శనాలు బోధించారు. ఒక రోజు నాతో ‘సత్యార్థ ప్రకాశం’ చదివారా?’ అని అడిగారు. ‘చదవలేదు గానీ డా.కోడూరు సుబ్బారావు నాకు దాన్ని ఇచ్చారు గురువుగారు’ అని సమాధానం ఇచ్చాను.
ఆ తర్వాత సత్యార్థ ప్రకాశం నేను కూడా చదవాలని, కోడూరి వారిని కలవాలని అనుకున్నాను. సీతాఫల్‌మండిలో వారిని కలిసిన ప్పుడు ‘నాకు సత్యార్థ ప్రకాశం మొదటి గురువు, పండిత గోపదేవ శాస్త్రి రెండవ గురువు’ అని చెప్పిన మాటలు నా మీద బాగా పనిచేశాయి. వెంటనే సత్యార్థ ప్రకాశం చదవడం మొదలుపెట్టాను. ఒక రోజు సుబ్బారావు మాట్లాడుతూ ‘వేద ప్రతిపాదిత సత్యాన్ని తెలిపే అత్యుత్తమ గ్రంథం సత్యార్థ ప్రకాశం. అవైదికుడినైన నన్ను వైదికుణ్ని చేసింది ఆ గ్రంథమే. అయితే నాకు కలిగిన సందేహాలను తీర్చుకోవడానికి గోపదేవ గారే గురువుగా లభించారు. మలక్‌పేటలో వారి ‘వేద సప్తాహం’లో నాకు పాల్గొనే అవకాశం లభించింది. సృష్టికి మూలకారణం ఒక్క పరమేశ్వరుడే అన్న జ్ఞానం గురువుగారి వల్లనే కలిగింది. ఆ తర్వాత సీతాఫల్‌మండి ఆర్యసమాజంలో గురువు గారు కఠోపనిషత్తు మీద ఒక నెల రోజులు ప్రసంగించగా విన్నాను’ అని ఎన్నో విషయాలు తెలియజేశారు గురువుగారి గురించి.
గోపదేవగారి శిష్యులలో కోడూరి సుబ్బారావు గారొకరు. వారు గురువుగారి ప్రభావానికి పూర్తిగా లొంగిపోయారు. అందువల్ల వారిని ఆర్యవిద్వాంసుల విషయ ప్రతిపాదన, విశ్లేషణ, వేద ప్రమాణం, ఋషి ప్రమాణం, హేతుబద్ధత, వైజ్ఞానికతలు ఎంతో ఆకర్షించాయి. శరీర దౌర్బల్యం వల్ల ఇంకా ఎన్నో గ్రంథాలు చదవవలసినవి చదవలేదని వారి అభిప్రాయం. కానీ, వారు హిందీలోని వైదిక గ్రంథాలను కూడా చదివారు. కోడూరి సుబ్బారావు గారిది వైజ్ఞానిక దృష్టి. అందుకు వారు రచించిన ‘అగ్నిహోత్రం 100 శాతం వైజ్ఞానికం’, ‘అగ్నిహోత్ర రసాయనిక విశ్లేషణ’, ‘అగ్నిహోత్ర ఆధ్యాత్మిక స్వరూపం’, ‘వేదాలలో సూర్యకిరణ చికిత్స’, వేదాలలో జలచికిత్సా విజ్ఞానం’, సంధ్యావందనం వైజ్ఞానిక సమాలోచన’, ‘వేదాలలో వర్షేష్టి విజ్ఞానం’, ‘వైదిక శాంతి పాఠం వైజ్ఞానిక వ్యాఖ్య’, ‘వేదాలలో మనోవిజ్ఞానం’ మొదలైన గ్రంథాలు సాక్ష్యంగా నిలుస్తాయి. ఇప్పటివరకు కోడూరి వారు తెలుగులో 40 గ్రంథాలు రచించారు. అవి మేడిబావి ఆర్యసమాజంలో లభిస్తాయి.
గోపదేవ గారి ద్వారా ఎంతో వైదిక జ్ఞాన సంపద లభించినప్పటికీ, సుబ్బారావు తాను గురువుగారి దగ్గర దర్శనాలను చదవలేదనే అసంతృప్తికి గురయ్యారు. కానీ, సత్యమార్గం దొరికినందుకు ఎల్లవేళలా పరమేశ్వరుని పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉన్నారు.
సుబ్బారావు సేవా దృష్టి గొప్పది. వారు 1975లో ఆర్యసమాజం (మేడిబావి)లో హోమియో చికిత్సాలయాన్ని స్థాపించి, రోగులకు చికిత్స చేస్తూ వచ్చిన ఆదాయాన్ని ‘వ్యాస్ పాఠశాల’ అభివృద్ధికి వెచ్చించారు. కరెంటు బిల్లు కట్టడానికి కూడా కష్టమైన పరిస్థితిలో సుబ్బారావు గారు చికిత్సాలయం ద్వారా వచ్చిన డబ్బులతో సమాజాన్ని ఒక గాడిలో పడేశారు. సమాజం కోసం ఒక మైక్‌సెట్ కొని, రోజూ ఒక అరగంట సేపూ వేదమంత్రాలను అర్థయుక్తంగా ప్రసారం చేస్తూ ఉండేవారు. ఆ కాలంలో పెద్ద పెద్ద భవనాలు లేకపోవడం వల్ల మైక్‌సౌండ్ అటు అడిక్‌మెట్ వరకు, ఇటు సీతాఫల్‌మండి వరకు వినిపించేది.
పండిత నరేంద్ర జీ, మున్నాలాల్ మిశ్రా, విజయవీర్ విద్యాలంకార్, వందేమాతరం రామచంద్రారావు, అన్నె వెంకటేశ్వరశాస్త్రి వంటి వైదిక విద్వాంసుల ప్రవచనాలతో పునీతమైన మేడిబావి ఆర్యసమాజం అనంతర కాలంలో కోడూరి సుబ్బారావు వల్ల ఇప్పటిదాకా ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నది.
వైదిక ధర్మ ప్రచారకులుగా, ఆదర్శ హోమియో వైద్యులుగా, వైజ్ఞానిక రచయితగా, స్మితహిత మితభాషిగా, త్యాగశీలిగా, గాయత్రీ ఆశ్రమ వ్యవస్థాపకులుగా పేరుగాంచిన కోడూరి సుబ్బారావు గారు ఒక యోగిగా తమ చరమ జీవితాన్ని పాలతోనే కొనసాగిస్తూ నేటికి 85వ సంవత్సరంలో అడుగుపెట్టిన ధన్యజీవులు.
వ్యాసకర్త సెల్: 9885654381
ఆచార్య మసన చెన్నప్ప






