ఈసారి హాలీవుడ్ ఛాన్స్ మిస్!
బాలీవుడ్ భామ దీపికా పదుకొణె ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తూ అందరిని ఆశ్చర్చచకితులను చేస్తోంది. సినిమాలను ఒప్పుకునే క్రమంలో దీపికా పెట్టిన నిబంధనలు ఆమె అవకాశాలను కోల్పోవాల్సి వస్తోంది. ఇది అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాను పెట్టిన కండీషన్స్ కారణంగా దీపికా ఒప్పుకున్న ప్రాజెక్టులు వరుసగా చేజారిపోతున్నాయి.
ఇప్పటికే టాలీవుడ్‌లో రెండు సినిమాల నుంచి వైదొలగాల్సి వచ్చిందీ బ్యూటీ. దీపికాను తొలుత ప్రభాస్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ చిత్రం నుంచి తప్పించారు. మరికొన్ని రోజులకే ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం ‘కల్కి 2’ ప్రాజెక్టునూ దీపికా వదులుకోవాల్సి వచ్చింది. దీపికా ఇలా సినిమాలను కోల్పోవడం ఇంతటితో ఆగలేదు. తాజాగా ఓ హాలీవుడ్ ఛాన్స్‌ను కూడా దీపికా మిస్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ‘ది వైట్ లోటస్’.. హాలీవుడ్‌లో ఎంతో పాపులర్ వెబ్‌సిరీస్.
ఈ సిరీస్ 4వ సీజన్ కోసం దీపికా పదుకొణె పేరును పరిశీలించిన మేకర్స్ ఇందుకోసం ఆమెను ఆడిషన్‌కు రావాల్సిందిగా కోరారని సమాచారం. అయితే, దీపికా మాత్రం తాను ఆడిషన్‌కు రాలేనని తేల్చిచెప్పేసిందట. దీంతో ఆమె స్థానంలో వేరొక నటిని తీసుకునేందుకు ఆ సిరీస్ టీమ్ సిద్ధమైందనేది తాజాగా భారతీయ చిత్రపరిశ్రమల్లో వినవస్తున్న మాట. ఎంతో ప్రేక్షకాదరణ పొందిన సిరీస్‌లో నటించే అవకాశాన్ని దీపికా చేజేతులా కోల్పోవటం ఆమె ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేస్తోంది.
దీపికా గతంలో ‘ఎక్స్‌ఎక్స్‌ఎక్స్: రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్’ అనే సినిమాతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హాలీవుడ్ సినిమాల్లో ఆమె నటించలేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడు మంచి కమ్‌బ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉన్నా, దాన్ని చేజార్చుకోవటం పట్ల అటు బాలీవుడ్, ఇటు దక్షిణాది ఇండస్ట్రీల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా దీపికా తీరు పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.




