21-02-2026 12:00:00 AM
రూ.30 లక్షలకు పైగా దుర్వినియోగం విచారణ నివేదిక వెలుగులోకి
హనుమకొండ, ఫిబ్రవరి 20(విజయ క్రాంతి):హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణంలో భారీ స్థాయిలో అవినీతి జరిగినట్లు అధికారిక విచారణ నివేదికలో తేలింది. కేంద్ర ప్రభుత్వ పథకమైన స్వచ్ఛ భారత్ మిషన్ కింద 201618 మధ్య వందలాది మరుగుదొడ్లు నిర్మించినట్లు రికార్డుల్లో చూపించి వాస్తవంగా నిర్మాణాలు జరగకుండానే ప్రభుత్వ నిధులను అధికారులు దుర్వినియోగం చేసినట్లు వెళ్లడైంది.
ఈ అవకతవకలపై ఫిర్యాదు చేసిన పుల్ల అన్వేష్ విజ్ఞప్తి మేరకు, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ (డిఆర్డిఏ) ఆదేశాలతో 8 మంది అధికారులు గ్రామంలో సమగ్ర విచారణ చేపట్టారు. విచారణ అనంతరం రూపొందించిన నివేదిక కాపీని ఫిర్యాదుదారునికి అందజేశారు.
నివేదికలో కీలక అంశాలు వెల్లడి
విచారణ నివేదిక ప్రకారం మొత్తం 286 మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.34.32 లక్షలు ఖర్చయినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. మరో 167 మరుగుదొడ్లకు రూ.20.04 లక్షలు విడుదల చేయాల్సివుంది. వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే సుమారు రూ.30.44 లక్షల వరకు దుర్వినియోగం జరిగినట్లు నిర్ధారణ అయింది.
విచారణ అనంతరం బయటపడిన అవకతవకలు
నివేదికలో పలు అక్రమాలు స్పష్టంగా నమోదు చేశారు.నిర్మాణాలు పూర్తికాకముందే బిల్లుల సమర్పణ తప్పుడు నివేదికలు తయారు చేయడం లబ్ధిదారుల పేర్లతో అక్రమ డ్రా, మంజూరైన నిధులు పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందకపోవడం వంటివి జరిగినట్లు తెలిసింది. డబ్బుల చెల్లింపుల వ్యవహారంలో తీవ్ర లోపాలు చోటుచేసుకున్నాయని చాలా మంది లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా అందలేదని నివేదికలో పేర్కొన్నారు.
విచారణ అధికారులతో లబ్ధిదారుల ఆవేదన
మరుగుదొడ్లు నిర్మించినట్లు ఆన్లైన్ రికార్డుల్లో నమోదు కావడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాస్తవంగా డబ్బులు అందకపోయినా తీసుకున్నట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉండటంతో వారు అయోమయంలో ఉన్నారు.
మాకు మరుగుదొడ్లు కూడా కట్టలేదు, డబ్బులు కూడా ఇవ్వలేదు కానీ రికార్డుల్లో అన్నీ పూర్తయినట్లు చూపిస్తున్నారు.అంటూ పలువురు వాపోయారు.
ప్రభుత్వ చర్యలపై అంచనాలు
ఈ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం. అభివృద్ధి పేరుతో జరిగిన ఈ అవినీతి కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా ప్రజాధనానికి రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.
కఠిన చర్యలు తీసుకోవాలి
ఈ సందర్భంగా పుల్ల అన్వేష్ మాట్లాడుతూ అవినీతికి పాల్పడ్డ అధికారులు, సంబంధిత సర్ప్ంప వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దుర్వినియోగమైన నిధులను తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని కోరారు. ప్రజల అభివృద్ధి కోసం వచ్చిన నిధులను దోచుకోవడం దుర్మార్గం. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలి అని ఆయన స్పష్టం చేశారు.
- పుల్ల అన్వేష్