కాలనీలలో పర్యటించిన ఎమ్మెల్యే జీఎంఆర్
సమస్యల పరిష్కారానికి హామీ..
అమీన్పూర్, జూలై 5: అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని ప్రతి కాలనీని అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తూ.. నిధులు కేటాయిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం బీరంగూడ డివిజన్ పరిధిలోని మారుతి నగర్, మధురా నగర్ కాలనీలో పర్యటించి.. ప్రజలతో నేరుగా సమావేశమయ్యారు. కాలనీలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ప్రధానంగా కాలనీలు రోజురోజుకి అభివృద్ధి చెందిన మూలంగా పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు పునర్నిర్మానం చేయాలని వారు ఎమ్మెల్యే జిఎంఆర్ ను కోరారు. ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయిస్తున్నామని ఆయన తెలిపారు. పై రెండు కాలనీలలో ప్రధాన సమస్యలైన యుజిడి, వర్షపు నీటి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఇంజనీరింగ్ విభాగం ఈఈ సురేష్ ను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా నిధులు కేటాయిస్తామని తెలిపారు.
అతి త్వరలో వీటి నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. బీరంగూడ శివాలయం కమాన్ వద్ద డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిఈ వెంకటరమణకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్, సీనియర్ నాయకులు జగదీష్, రమేష్ గౌడ్, సునీత, లక్ష్మీకాంత్ రెడ్డి, దాసు, మల్లేష్, ఆయా కాలనీల ప్రజలు పాల్గొన్నారు.






