6 July, 2026 | 2:51 AM

సదాశివపేట బైపాస్‌లో రోడ్డు ప్రమాదం

06-07-2026 01:57 AM

ఒకరు మృతి,ముగ్గురికి గాయాలు

సదాశివపేట, జూలై 5 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని జాతీయ రహదారి- బైపాస్‌పై ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి వైపు నుంచి జహీరాబాద్ దిశగా అతి వేగంగా వెళ్తున్న కంటైనర్ లారీ అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. కారు, ట్రాక్టర్, మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. దీంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడిన వారిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో వాహనాలు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యాయి. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.