16 August, 2026 | 11:30 AM

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. ఇప్పుడు ఒక మాట: హరీశ్ రావు

17-06-2024 01:10 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ కార్యాలయానికి గ్రూప్స్ అభ్యర్థులు వచ్చి వినతిపత్రం ఇచ్చారని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ భవన్ లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.... గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 చొప్పున తీయాలని అభ్యర్థులు కోరుతున్నారని చెప్పారు. విపక్షంలో ఉన్నప్పుడు 1:100 చొప్పున తీయాలని యవతను రెచ్చగొట్టారని గుర్తుచేశారు. ఇప్పుడు ఎందుకు గ్రూప్-1 మెయిన్స్ కు  1:100 తీయడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు.

గ్రూప్స్ పోస్టులు పెంచాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడిగారు? పోస్టులు పెంచాలని అభ్యర్థులు కోరితే ఇప్పుడు స్పందించట్లేదని ప్రశ్నించారు. గ్రూప్స్ పరీక్షలకు మధ్య వ్యవధి ఉండాలని అభ్యర్థులు కోరుతున్నారని ఆయన వెల్లడించారు. ప్రభుత్వాన్ని నిలదీయాలని అభ్యర్థులు తమ వద్దకు వచ్చి కోరారన్నారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు.. ఎప్పుడు ఇస్తారు? మెగా డీఎస్సీ కింద 25 వేల ఉద్యోగాలు ఇస్తామని 11 వేలతో సరిపెట్టారని ఆరోపించారు. హామీ మేరకు 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. ఇప్పడు ఒక మాట చెప్తున్నారని మండిపడ్డారు.