3 August, 2026 | 1:43 AM

శంషాబాద్ బోనాల పండుగలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

03-08-2026 12:00 AM

శంషాబాద్, ఆగస్టు 02, (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర విశిష్ట పండుగ అయిన ఆషాడ బోనాల సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం, శంషాబాద్ సర్కిల్ పరిధిలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆదివారం నాడు  శంషాబాద్ సర్కిల్ పరిధిలోని పలు అమ్మవారి దేవాలయాలను సందర్శించారు. ఈ ఉదయం వివిధ దేవాలయాలకు విచ్చేసిన ఆయన, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తన మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు, మహిళలు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.