09-12-2025 01:23:17 PM
- అధికార దుర్వినియోగం అహంకారం
- భూకబ్జాలు దోపిడీలు ఇదే గత బిఆర్ఎస్ పాలన తీరు
- ప్రజా పాలనలోనే ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు
- గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమ పార్టీగా పేరొందిన టిఆర్ఎస్ గత పదేళ్లు అధికారంలో ఉండి భూకబ్జాలు, ఇసుక దంద, అక్రమాలు, అవినీతి రాజ్యమేలి సామాన్య జనంపై అహంకారం అణచివేత ప్రదర్శించిన తీరు ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. ఇప్పుడిప్పుడే ప్రజా ప్రభుత్వంలో ప్రజలంతా స్వేచ్ఛగా బ్రతుకుతున్నారని స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తెలకపల్లి, తాడూర్ మండలాల్లో తాను బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ ఓటమి చెందుతుందన్న భయంతో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టిఆర్ఎస్ నేతల మాటలు నమ్మితే మరోసారి మోసపోక తప్పదన్నారు. పదేళ్లపాటు అరాచకంగా పాలించిన తీరు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఇప్పుడు అధికారం కోల్పోయాక సుద్దపూస మాటలు వల్లిస్తున్నారని మండిపడ్డారు. అధికార మదంతో అన్ని వ్యవస్థలను తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసారని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై అణిచివేత ప్రదర్శిస్తూ సామాన్యులను జైలు పాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజా పాలన కొనసాగిస్తూ ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రం కల్పిస్తున్నారని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ, రైతు పెట్టుబడి సాయం, బోనస్, నూతన రేషన్ కార్డుల మంజూరు సన్న బియ్యం పంపిణీ వంటి పథకాలు దిగ్విజయంగా అమలవుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుంటే గ్రామాలు మరింత అభివృద్ధి బాటలో నడుస్తాయని ఆశ భావం వ్యక్తం చేశారు.