22 April, 2026 | 11:02 AM

బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి

10-05-2024 12:12 AM

మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి 

చేవెళ్లలో కాసానిదే  విజయమని వెల్లడి

వికారాబాద్, మే 9 (విజయక్రాంతి): చేవెళ్ల పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి, మహే శ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నా రు. గురువారం వికారాబాద్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సబితా ఇంద్రారెడ్డితోపాటు మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, బీఆర్‌ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, వికారాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిందని, ఆరు నెలలు గడిచినా అమలు చేయలేదని విమర్శించారు.

పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందునే ఆగష్టులో రైతు రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటిస్తున్నారని, ఎన్నికలు లేకుంటే మరో మూడేండ్ల తరువాత రుణమాఫీ గుర్తుకు వచ్చేదని దుయ్య బట్టారు. ఇచ్చిన హామీలను అమలు చేసే సత్తాలేని కాంగ్రెస్, మాటలతో కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్‌కు సాధ్యం కాదని దెప్పిపొడిచారు. బడుగు బలహీనవర్గాల బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉన్నదని పేర్కొన్నారు. బీసీ నేతగా జ్ఞానేశ్వర్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినట్టు తెలిపారు. ఈ రెండు రోజులు నాయకులు, కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. సమావేశంలో వికారాబాద్ పట్టణ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.