10 July, 2026 | 10:19 AM

అర్హులందరికీ జీరో బిల్ ఇవ్వండి: ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి

10-06-2024 05:01 PM

విద్యుత్ శాఖ ఎస్సీ తో సమావేశమైన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ : అర్హులైన వారందరికీ వెంటనే జీరో కరెంట్ బిల్లు ఈ నెల నుంచి అందించేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయానికి చేరుకొని ఎస్ఈ వెంకట రమేష్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ నుపూర్తిస్థాయిలో అర్హులకు అందించాలని స్పష్టం చేశారు.

ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దుకొని ప్రతి ఒక్కరికి 6 క్యాలెండర్ లో ఒక గ్యారెంటీ అయిన జీరో బిల్ అమలు చేసే దిశగా అధికారులు పకడ్బందీగా ముందుకు సాగాలని సూచించారు. వస్తున్న వర్షాకాలం పరిగణలోకి తీసుకొని రైతులకు ఎలాంటి విద్యుత్ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యుత్ వైర్లు స్తంభాలు ఎక్కడైనా ఒరిగినట్లు, మరేమైనా సమస్య ఉన్నట్లు ఉంటే వెంటనే వాటిని గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. నాణ్యమైన విద్యుత్ ను ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలని, అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని సూచించారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే 98 వేల మంది లబ్ది పొందుతున్నారని ఎస్ఈ వెంకట రమేష్ ఎమ్మెల్యేతో చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తదితరులు ఉన్నారు.