24 June, 2026 | 1:38 AM

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను, అధికారులను సన్మానించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

24-06-2026 12:33 AM

చిట్యాల, జూన్ 23 : నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించి కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన నిర్వాహకులను , అధికారులను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఘనంగా సన్మానించారు. మంగళవారం నకిరేకల్ పట్టణంలోని నారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని కొనుగోలు కేంద్రాల నిర్వహణలో విశేష కృషి చేసిన అధికారులకు, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయడంలో అధికారులు, నిర్వాహకులు ఎంతో కష్టపడ్డారని అన్నారు. వర్షాల కారణంగా వడ్లు తడవకుండా, రైతులకు నష్టం కలగకుండా రాత్రింబవళ్లు శ్రమించామని పేర్కొన్నారు. రైతులు సంతోషంగా ఉండటం తమకు ఆనందంగా ఉందన్నారు.

ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతిపక్షాలు అనేక అసత్య ఆరోపణలు చేశాయని, అయితే ఈ సీజన్లో భారీగా ధాన్యం వచ్చినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి కొనుగోలు ప్రక్రియను వేగంగా పూర్తి చేశామని తెలిపారు. భవిష్యత్తులో రైతులు దొడ్డు రకాల సాగుతో పాటు సన్న వడ్ల సాగును కూడా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.