నాణ్యమైన విద్యకు చిరునామా గురుకులం
మిట్టపల్లి గురుకుల డిగ్రీ
కళాశాలలో ఎస్సీ విద్యార్థినులకు ప్రవేశాల అవకాశం
సిద్దిపేట, జూన్ 23 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామంలో కొనసాగుతున్న తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల మహిళా డిగ్రీ కళాశాల గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ ఆదర్శ విద్యా సంస్థగా నిలుస్తోంది.
విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, పోటీ పరీక్షల సన్నద్ధత, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ విద్యార్థినులను ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తోంది. ప్రస్తుతం కళాశాలలో బి.ఎస్సీలో ఎంపీసీస్, ఎంపిసిఎస్, బిజెడ్ సీ, ఎం జెడ్ సి, బికాం (సి ఏ), బికాం (జనరల్), బిఏ హెచ్‌ఈపి, కోర్సుల్లో ఎస్సీ కేటగిరీకి చెందిన కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. అర్హత కలిగిన విద్యార్థినులు వెంటనే దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డా. సునీత తెలిపారు.
ప్రత్యేకతలు..
గురుకుల విద్యా విధానంలో భాగంగా అనుభవజ్ఞులైన అధ్యాపకుల ద్వారా నాణ్యమైన బోధన, డిజిటల్ తరగతి గదులు, సెమినార్లు, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ, కెరీర్ గైడెన్స్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థినుల విద్యా ప్రగతిని నిరంతరం పరిశీలిస్తూ ప్రత్యేక శ్రద్ధతో బోధన అందిస్తున్నారు.
కళాశాలలో పూర్తిగా ఉచిత విద్యతో పాటు వసతి, పోషకాహారంతో కూడిన భోజనం, గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, క్రీడా సౌకర్యాలు, ఆరోగ్య సేవలు వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితిని నివారిస్తూ విద్యార్థినులకు సమగ్ర విద్యా వాతావరణాన్ని కల్పిస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థినుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 24 గంటల పర్యవేక్షణ, మహిళా వార్డెన్లు, క్రమబద్ధమైన హాస్టల్ నిర్వహణ, సురక్షిత క్యాంపస్ వాతావరణాన్ని ఏర్పాటు చేశారు.
తల్లిదండ్రులు కుమార్తెలను నమ్మకంగా విద్యాభ్యాసం కోసం పంపేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గురుకుల విద్య ద్వారా అనేక మంది విద్యార్థినులు ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన వర్గాల బాలికలకు ఈ కళాశాల ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేస్తోంది.
బంగారు భవిష్యత్తు కోసం..
బంగారు భవిష్యత్తు కోసం విద్యార్థులు ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాలలో చేరాలి. ఎస్సీ కేటగిరీకి చెందిన అర్హులైన విద్యార్థినులు ఖాళీగా ఉన్న సీట్లను సద్వినియోగం చేసుకుని వెంటనే ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డా. సునీత కోరారు. విద్యార్థులు నేరుగా తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల, మిట్టపల్లి లేదా 7995660882 నంబర్ లో సంప్రదించాలి.
డా. సునీత, ప్రిన్సిపాల్






