26 August, 2026 | 6:21 PM

విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణించాలి

26-08-2026 05:50 PM

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే విజయరమణారావు

సుల్తానాబాద్‌,(విజయక్రాంతి): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించేలా ప్రోత్సహించాలని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్‌లో కోచ్‌ బొల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఎన్‌ఆర్‌ టేబుల్‌ టెన్నిస్‌, చెస్ స్పోర్ట్స్‌ అకాడమిని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బిరుదు కృష్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అంతటి అన్నయ్యగౌడ్‌ తో కలిసి అకాడమీని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. చిన్ననాటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచి, ప్రతిభను గుర్తించి సరైన శిక్షణ అందిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుందన్నారు. సుల్తానాబాద్‌ లో టేబుల్‌ టెన్నిస్‌, చెస్ క్రీడకు ప్రత్యేకంగా అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఎస్‌ఎన్‌ఆర్‌ స్పోర్ట్స్‌ అకాడమీ ద్వారా స్థానిక విద్యార్థులు, యువ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ లభించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ అంతటి పుష్పలత, స్పోర్ట్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్‌, ఇండియన్‌ పబ్లిక్‌ పాఠశాల చైర్మన్‌ సంజీవ్‌ కుమార్‌, ప్రిన్సిపల్‌ కృష్ణప్రియ, టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కోడం అజయ్‌, స్పోర్ట్స్ క్లబ్ కార్యదర్శి అమ్మిరీశెట్టి తిరుపతి, మున్సిపల్‌ కౌన్సిలర్లు, పలువురు ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు..