27-10-2025 08:12:47 PM
- సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు
- తప్పుడు ఆరోపణలు మానుకోకుంటే ప్రజలు సహించరు
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలో గెలిచిన 22 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎమ్మెల్యే గడ్డం వినోద్ రూ. 451 కోట్ల నిధులను మంజూరు చేయించారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల రవి స్పష్టం చేశారు. సోమవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని ఆరోపించారు. సోషల్ మీడియాలో ఆ పార్టీ చిన్నచితకానేతలు తమ హోదాను విస్మరించి ఎమ్మెల్యే వినోద్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే వినోద్ విద్యకు ప్రాధాన్యత ఇస్తూ బెల్లంపల్లికి రూ 350 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ని మంజూరు చేయించారని తెలిపారు. పేద విద్యార్థులకు అనుగుణంగా ఐటీసీని కూడా మంజూరు చేయించారని గుర్తు చేశారు. నిరుద్యోగుల కోసం మెగా జాబ్ మేళా నిర్వహించారని తెలిపారు.
జాబ్ మేళాలో 6547 మంది హాజరు కాగా 3339 వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసిన బీ ఆర్ ఎస్ నాయకులు ఎమ్మెల్యే వినోద్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక సోషల్ మీడియాలో తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూ 19.81 కోట్ల నిధులతో రహదారులు, రూ 6.14 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల ప్రహరీ గోడలు నిర్మించారన్నారు. రూ 7.03 కోట్లతో అమ్మ ఆదర్శ పాఠశాల నిర్మాణం, రూ 10 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్, రూ 10 కోట్ల డిఎంఎఫ్టి నిధులు, రూ 3.4 కోట్ల సి ఎస్ ఆర్ నిధులు, రూ 17 కోట్ల సి ఆర్ ఆర్ ఎస్ సి సబ్ ప్లాన్ నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
అమృత్ 2.0 పథకం కింద రూ 61.50 కోట్ల నిధులతో బెల్లంపల్లి మున్సిపల్ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించే పనులు చేపడుతున్నట్లు చెప్పారు. పీఎం జెన్ దన్ పథకం కింద రూ 2.83 కోట్లు, పి ఎం జి ఎస్ వై కింద రూ 1.93 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ 1.43 కోట్లు, 2023-2024 స్పెషల్ డెవలప్మెంట్ నిధులు రూ 1.29 కోట్లు, ఆర్ అండ్ బి శాఖ ద్వారా రూ 5.40 కోట్లతో గ్రామాలలో మురికి కాలువలు ,రోడ్ల పనులను పూర్తి చేసినట్టు చెప్పారు. పాఠశాలల మరమ్మత్తులకు రూ 3.20 కోట్లు, ఇరిగేషన్ నిధులు రూ 64 లక్షలు, ఐటీడీఏ నిధులు రూ 23 కోట్లతో గ్రామాలలో రహదారుల నిర్మాణానికి వెచ్చించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం నిరుపేదలకు ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేయలేదని, కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యే వినోద్ నియోజకవర్గంలో ఇల్లు లేని 3500 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేయించారని తెలిపారు.
బెల్లంపల్లి పట్టణంలోని రాంనగర్, మండల పరిధిలోని చర్లపల్లి లో 20 లక్షలతో నూతన పాఠశాలల భవనాలు నిర్మించడం జరిగిందని తెలిపారు. నెన్నల, బెల్లంపల్లి లోని కేజీబీవీ పాఠశాలల భవనాలకు రూ 6 కోట్లు, తాండూర్ మండలంలో హాస్టల్ నిర్మాణానికి రూ రెండు కోట్లు, బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ 18 కోట్ల నిధులను మంజూరు చేయించి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. బి ఆర్ ఎస్ నాయకులు పేదలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కోటి మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిన విషయం బి ఆర్ ఎస్ నాయకులు గుర్తించాలని అన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే పై తప్పుడు ఆరోపణలు, విమర్శలు మానుకోవాలని లేనట్లయితే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దూడం మహేష్, మైదం రమేష్, గోలేటి స్వామి, మారపాక వంశీ, బండిరాము, కన్నూరిరాజలింగు పాల్గొన్నారు.