కవిత మాజీ ఎంపీ.. ఆమె ఎక్కడికీ వెళ్లరు
న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరుగుతుంది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎమ్మెల్సీ కవిత తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు. ఈడీ కేసులో కవిత గత ఐదు నెలలుగా జైలులోనే ఉన్నారని, ఈ కేసుకు సంబంధించి 493 మంది సాక్షులను విచారించారని ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. ఒక మహిళగా కవిత బెయిల్ కు అర్హురాలన్నారు.
కవిత మాజీ ఎంపీ.. ఆమె ఎక్కడికీ వెళ్లరని ముకుల్ కోర్టుకు వెల్లడించారు. రూ.100 కోట్లు ముడుపుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, కవిత నుంచి ఇప్పటికి ఈడీ ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదని ఆయన సూచించారు. కానీ ఇదే కేసులో మనీశ్ సిసోదియాకు బెయిల్ మంజూరైందని, సిసోదియాకు వర్తించిన నిబంధనలే కవితకు కూడా వర్తిస్తాయని ముకుల్ గుర్తు చేశారు. దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కవిత అప్పగించారని తెలిపారు. ఈడీ తరుపున ఏఎస్జీ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఎమ్మెల్సీ కవిత తరచూ ఫోన్లు మార్చారన్న ఏఎస్జీ ఉద్ధేశపూర్వకంగానే ఫోన్లలోని డేటాను పూర్తిగా తొలగించారని పేర్కొన్నారు.
ఫార్మాట్ చేసిన ఫోన్లను ఇంట్లో పనిమనుషులకు ఇచ్చారని ఏఎస్జీ కోర్టుకు వెల్లడించారు. ఫోన్ లోని మెసేజ్ లను సాధారణంగా అందరూ తొలగిస్తారని, నేను కూడా నా ఫోన్ లోని మెసేజ్ లను తరచూ తొలగిస్తాన్నాని న్యాయమూర్తి అన్నారు. ఫోన్ లోని సందేశాలను తొలగిస్తే తప్పేంటాని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. మెసేజ్ లను కాదు.. పూర్తిగా అందులోని డేటాను ఫార్మాట్ చేశారని ఏఎస్జీ వెల్లడించారు. సెల్ ఫోన్ డేటాను పూర్తిగా ఫార్మాట్ చేయడం అసాధారణం అని ఏఎస్జీ పేర్కొన్నారు.






