25 August, 2026 | 1:08 AM

ఆదర్శ కమ్యూనిస్ట్ కామ్రేడ్ సారంపెల్లి మల్లారెడ్డి

25-08-2026 12:09 AM

సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.చుక్కయ్య

హనుమకొండ (మహబూబాబాద్) ఆగస్టు 24 (విజయక్రాంతి): నిరంతరం శ్రామిక ప్రజల హక్కుల కోసం, రైతాంగం సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడి ఆదర్శ కమ్యూనిస్టుగా కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి ప్రజల గుండెల్లో అజరామంగా నిలుస్తారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం. చుక్కయ్య అన్నారు.  సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభ సిపిఎం హనుమకొండ జిల్లా కార్యాలయంలో , జిల్లా కమిటీ సభ్యులు గొడుగు వెంకట్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్బంగా  కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.చుక్కయ్య   మాట్లాడుతూ సారంపెల్లి మల్లారెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా  రైతు సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా, అఖిల భారత కిసాన్ సభ జాతీయ  ఉపాధ్యక్షులుగా, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా, కంట్రోల్ కమిషన్ చైర్మన్ గా, బాధ్యతలు నిర్వర్తించాలని తెలిపారు.

తన చివరి శ్వాస వరకు కూడా కమ్యూనిస్టు నాయకునిగా నిరాడంబరమైన జీవితం గడిపారన్నారు. 88 ఏళ్ల వయసులో ఆయన మరణించడం పార్టీకి తీరని లోటు అని వారి వారికి సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు. ఆయన వ్యవసాయ రంగంలో నిపుణుడని, నిష్ణాతుడని అనేకమంది అధికారులకు, అనధికారులకు, పార్టీ కార్యకర్తలకు, రైతు సంఘం కార్యకర్తలు, నాయకులకు, విద్యార్థులకు  అనేక విషయాలపై వ్యవసాయ రంగంపై ప్రాజెక్టులపై వివరణ ఇచ్చారన్నారు.

ఆయనొక విజ్ఞాన ఘని అని, ఆదర్శ కమ్యూనిస్టు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొట్ల చక్రపాణి, రాగుల రమేష్,  జిల్లా కమిటీ సభ్యులు మంద సంపత్, జిల్లా నాయకులు ఓరుగంటి సాంబయ్య, ఎం.రమాదేవి, కారు ఉపేందర్, మంద మల్లేశం, జంపాల రమేష్, ఉమాకార్, కావ్య, తదితరులు పాల్గొన్నారు.

సారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల సీపీఐ దిగ్భ్రాంతి

సీపీఎం సీనియర్ నాయకులు, రైతు సంఘం అఖిల భారత నాయకులు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి  అకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతిని, శోకాన్ని కలిగించిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు  తెలిపారు. సారంపల్లి మల్లారెడ్డి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర విచారానికి గురయ్యాని తెలిపారు.

రైతాంగ సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు కామ్రేడ్ మల్లారెడ్డి రైతు కూలీల, పేదల హక్కుల సాధన కోసం తన జీవితాన్ని ధారపోసిన గొప్ప ప్రజా నాయకుడని, ఆయన మరణం రైతు ఉద్యమానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన కామ్రేడ్ మల్లారెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.