22 July, 2026 | 4:50 PM

మోదీ ప్రమాణానికి ప్రపంచ దేశాధినేతలు

07-06-2024 01:24 AM

ఈనెల 9న కర్తవ్యపథ్‌లో ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ, జూన్ 6: ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ప్రపంచ దేశాధినేతలు తరలిరానున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే హాజరు కానున్నట్లు ఆ దేశ అధ్యక్ష కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. బంగ్లాదేశ్ ప్రధాని సైతం శనివారం నాటి కార్యక్రమానికి హాజరు కానున్నారు. ప్రమా ణ స్వీకారం కోసం ఆమె ఒకరోజు ముందుగానే అంటే శుక్రవారమే ఢిల్లీకి చేరుకోనున్నారు.

వీరితో పాటు భూటాన్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ ప్రచండ, భూటాన్ షెరింగ్ టోబ్గే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్‌లను కూడా ప్రధాని మోదీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కాగా, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 240 స్థానాలు గెలుచుకుంది. 2014లో 282 సీట్లు, 2019లో 303 చోట్ల విజయ కేతనం ఎగరవేసి సొంతంగా మెజార్టీ స్థానాలు దక్కించుకున్న బీజేపీ.. ఈసారి మెజార్టీ (272) కంటే తక్కువ స్థానాలకే పరిమితమైంది. కేవలం 240 సీట్లను గెలుచుకున్న బీజేపీ.. ఎన్డీఏ కూటమి మిత్రపక్షాల సాయంతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కూటమి నేతల మద్దతుతో ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. 

కర్తవ్యపథ్‌లో ప్రమాణస్వీకారం

లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ మార్కును దాటిన ఎన్డీఏ కూటమి కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవు తోంది. మోదీ జూన్ 9న ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. తొలుత జూన్ 8న మోదీ ప్రమాణ స్వీకారం ఉంటుందని వార్తలు వెలువడగా.. తాజాగా ఆ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రానికి మార్చినట్లు సమాచారం.