22 July, 2026 | 3:48 PM

బీజేపీకి ‘అయోధ్య’ షాక్!

07-06-2024 01:28 AM

ఫైజాబాద్‌లో ఓటమిపై బీజేపీ అంతర్మథనం

బీజేపీ అధిష్టానానికి మింగుడుపడని తీర్పు

ఎస్పీకి కలిసొచ్చిన కుల సమీకరణాలు  

రాజ్యాంగం మార్పు అంశంతో పాటు, స్థానిక సమస్యలతో బీజేపీకి ఓటరు దూరం

లక్నో, జూన్ 6: 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో రంగంలోకి దిగింది. అయితే అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. పైగా బీజేపీకి ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇది బీజేపీకి ఆశ్యర్యాన్ని కలిగిస్తే.. అంతకుమించి షాక్‌నిచ్చింది అయోధ్య నియోజకవర్గం ఫలితం. హిందూత్వ, రామ మందిరం కేంద్రంగా బీజేపీ ఎన్నికల  ప్రచారం నిర్వహించింది. అయోధ్య రామమందిరం నిర్మాణం బీజేపీ వల్లే సాధ్యమైందంటూ ప్రధాని మోదీ సహా అందరు బీజేపీ నేతలు.. దాదాపు అన్ని ఎన్నికల ప్రచారంలో నొక్కి వక్కాణించారు. అయోధ్య మందిరం నిర్మాణం దేశవ్యాప్తంగా అఖండ విజయం సాధించి పెడు తుందని భావించిన బీజేపీకి.. మెజారిటీ మార్కు సీట్లు రాకపోవడమే కాకుండా.. ఏకంగా అయోధ్య ఉన్న ఫైజాబాద్‌లో ఓడిపోవడం పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు.

ఎందుకు ఓడిపోయింది?

అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన తర్వాత నాలుగు నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అయినా కూడా ఫైజాబాద్ బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్.. ఎస్పీ అభ్యర్థి అవదేశ్ ప్రసాద్ చేతిలో 54 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి ఓటమి వెనుక చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ ఓబీసీలు, దళితులను దూరంగా ఉంచినట్టు తెలుస్తోంది. కుల సమీకరణాల విషయంలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ చురుకుగా పనిచేశారు. ఇక అయోధ్య అభివృద్ధి కోసం స్థానికుల నుంచి తీసుకున్న భూమికి నష్టపరిహారం చెల్లించకపోవడం వల్ల వారిలో తీవ్ర అసహనం ఉంది. బీజేపీ ఢిల్లీ విభాగానికి పార్టీ లక్నో విభాగానికి మధ్య విబేధాలు ఉండటం.. క్షేత్రస్థాయిలో బీజేపీ నేతల సహకారం లేకపోవ డం కూడా పార్టీ ఓటమికి కారణాలు అని చెప్పొచ్చు. ఇక్కడి ఓటు బ్యాంకు ఎస్పీకి మద్దతుగా నిలిచింది. పైగా బీజేపీకి 400 సీట్లకు పైగా వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ చేసిన ప్రచారం కూడా ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసింది. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగా న్ని మారుస్తామంటూ బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ మొదటిసారిగా లేవనెత్తారు. ఎస్పీ దీన్ని ఆయుధంగా మార్చుకుంది.