మోదీ క్షమాపణలు చెప్పాల్సిందే
బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
అధికార మత్తుతో అహంకారం పెరిగింది: ఖర్గే
జగన్నాథుడిని, ఒడిశాను అవమానించారు: నవీన్
దేవుడి కన్నా గొప్ప అని భావిస్తున్నారు: కేజ్రీవాల్
పొరపాటున నోరు జారి మాట్లాడాను, దేవుడు క్షమిస్తాడు
మూడ్రోజులు ఉపవాసం ఉంటా: సంబిత్ పాత్రా
భువనేశ్వర్, మే 21: ఒడిశా పూరీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో తర్వాత ఆ పార్టీ నేత సంబిత్ పాత్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. పూరీలోని భగవాన్ జగన్నాథ్ మోదీకి భక్తుడం టూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ప్రధాని సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. మోదీ భక్తిలో మునిగితేలుతున్న సంబిత్ దేవుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని కాంగ్రెస్ విచారం వ్యక్తం చేసింది.
ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్వయంగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సంబిత్ వ్యాఖ్యలపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. శ్రీ జగన్నాథ మహా ప్రభు విశ్వానికే దేవుడు. అటువంటి దేవుడినే మోదీకి భక్తుడు అనడం భగవంతుడిని కించపరచడమే. ఈ వ్యాఖ్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జగన్నాథస్వామి కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను కించపరిచినట్లే అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను రాష్ట్రప్రజలకు చాలాకాలం గుర్తుంచు కుంటారని, ఖండిస్తారని నవీన్ పేర్కొన్నారు.
అధికార మత్తుతోనే..
సంబిత్ వ్యాఖ్యలపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా స్పందించారు. అధికార మత్తులో ఉన్న బీజేపీకి అహంకారం పెరిగిపోతోంది. మన దేవుళ్లను సైతం విడిచిపెట్టడం లేదు. వీళ్లు ఇక ప్రజలను మాత్రం ఎలా విడిచిపెడుతుంది. ఆ పార్టీ వ్యక్తులు జగన్నాథస్వామిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కోట్లాది మంది జగన్నాథుడి భక్తులను కించపరిచినట్లే. జూన్ 4న ప్రజల సంకల్పం ముందు బీజేపీ అహంకారం పటాపంచలు అవుతుంది అని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ నేత వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దేవుడిని అవమానించడమేనని దుయ్యబట్టారు. బీజేపీ నేతలు దేవుడి కంటే గొప్పవారని భావించడం మొదలుపెట్టారని మండిపడ్డారు.
ఉపవాస దీక్ష చేస్తా..
విపక్షాల విమర్శల దాడితో బీజేపీ ఎంపీ సంబిత్ వివరణ ఇచ్చారు. నమస్కార్ నవీన్ జీ. మోదీ రోడ్ షో తర్వాత పలు న్యూస్ చానళ్లతో మాట్లాడాను. అన్ని చోట్ల జగన్నాథ్ స్వామికి మోదీ భక్తుడని చెబుతూ వస్తున్నా. కానీ, చివరగా ఓ చానల్‌తో మాట్లాడుతూ పొరపాటున మోదీకి జగన్నాథ్ స్వామి భక్తుడని చెప్పాను. ద్రేవుడు కూడా అనుకోకుండా చేసిన తప్పుల్ని క్షమిస్తాడు. దీన్ని పెద్ద విషయం చేయకండి. నేను పొరపాటుగా చేసిన వ్యాఖ్యలతో చాలా బాధపడుతున్నా. ఆయన పాదాలకు నమస్కరించి క్షమించమని వేడుకుంటున్నా. నా తప్పును సరిదిద్దుకోవడానికి, నోరు జారినందుకు ప్రాయశ్చిత్తంగా మూడు రోజుల పాటు ఉపవాసం చేయాలని నిర్ణయించుకున్నా’ అని తన వివరించారు.






