20 June, 2026 | 6:20 PM

రూ.1.56 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ

20-06-2024 01:50 AM
  • ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ, జూన్ 19: ముగిసిన 2023 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.1.56 లక్షల కోట్ల విలువైన ఆస్తుల్ని నగదీకరణ చేసుకున్నది. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్‌ఎంపీ) కింద వృధాగా ఉన్న ప్రభుత్వ ఆస్తుల్ని లీజుకివ్వడం, విక్రయించడం ద్వారా 2023 రూ.1.80 లక్షల కోట్లు నగదు చేసుకోవాలని లక్ష్యంగా కేంద్రం నిర్ణయించింది. అంతకంటే తక్కువగానే నగదీకరణ జరిగినట్టు బుధవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఎన్‌ఎంపీ కింద 2022 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 ఆర్థిక సంవత్సరం వరకూ నాలుగేండ్లలో నగదీకరణకు రూ. 6 లక్షల కోట్ల మౌలిక ఆస్తులు ఉంటాయని అంచనా వేయగా, తొలి రెండేండ్లలో రూ.2.30 లక్షల కోట్ల ఆస్తుల్ని నగదీకరించింది.

2023 సాధించిన రూ.1.56 లక్షల కోట్లు 2021 సమీకరణకంటే 159 శాతం అధికమని ప్రకటనలో తెలిపింది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖలు రూ.40,314 కోట్లు, బొగ్గు మంత్రిత్వ శాఖ రూ.56,794 కోట్లు, విద్యుత్ శాఖ రూ.14,690 కోట్లు, మైనింగ్ శాఖ రూ.4,090 కోట్లు, పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ రూ. 9,587 కోట్లు, పట్టణ వ్యవహారాల శాఖ రూ.6,480 కోట్లు, నౌకా మంత్రిత్వ శాఖ రూ. 7,627 కోట్ల ఆస్తుల్ని నగదీకరించినట్టు పేర్కొంది. మంత్రిత్వ శాఖలన్నీ నిర్దేశిత లక్ష్యాల్లో 70 శాతం సాధించాయన్నది. ప్రైవేటు రంగం కొత్త మౌలిక సదుపాయాలు కల్పించి, ఉపాధిని పెంచేదిశగా ఎన్‌ఎంపీ కార్యక్రమాన్ని చేపట్టామని ప్రకటన పేర్కొంది. నగదీకరణకు అవకాశం ఉన్న ఆస్తుల జాబితాను సంబంధిత మంత్రిత్వ శాఖలతో కలసి నీతి ఆయోగ్  రూపొందించింది.