20 June, 2026 | 5:09 PM

మధ్యతరగతికి పన్ను ప్రయోజనాలు ఇవ్వాలి

20-06-2024 01:52 AM
  • పెట్రోల్, డీజిల్‌పై ఎక్సయిజు సుంకాల్ని తగ్గించాలి

కేంద్ర రెవిన్యూ కార్యదర్శితో పరిశ్రమ ప్రతినిధుల భేటీ

న్యూఢిల్లీ, జూన్ 19: వచ్చే కేంద్ర బడ్జెట్లో మధ్య తరగతి ప్రజలకు వ్యక్తిగత ఆదాయపు పన్ను ప్రయోజనాల్ని కల్పించాలని, ప్రత్యక్ష పన్నుల్ని సరళీకరించాలని ఆర్థిక శాఖ అధికారులకు పరిశ్రమ ప్రతినిధులు విన్నవించారు. బుధవారం కేంద్ర రెవిన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాతో వివిధ పారిశ్రామిక చాంబర్ల ప్రతినిధులు సమావేశమైన సందర్భంగా ఈ వినతి చేశారు. రూ.20 లక్షల ఆదాయం వరకూ పన్ను ఊరట కల్పించాలని, పెట్రోల్, డీజిల్‌పై ఎక్సయిజు సుంకాన్ని తగ్గించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట సంజీవ్ పురి డిమాండ్ చేశారు.

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు శాతం తగ్గగా, ఢిల్లీలో లీటరు ధర రూ.1.8 మాత్రమే తగ్గిందన్నారు. వినియోగ వ్యయాలు తగ్గడంతో కొన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతున్నదని, జీడీపీ వృద్ధి రేటు, వినియోగ డిమాండ్‌ల మధ్య వ్యత్యాసం పెరుగుతున్నదని ఈ నేపథ్యంలో పన్ను భారాన్ని తగ్గించే వరాల్ని ప్రకటిస్తే దేశంలో వినియోగ వ్యయాలు పెరుగుతాయని పురి సూచించారు. మధ్య తరగతిపై ప్రస్తుతం 30 శాతం పన్ను రేటు ఉన్నదని, పొదుపునకు, ఇతర అవసరాలకు వారి చేతిలో మిగులు సొమ్ము లేకుండా పోతున్నదని, అందుచేత 30 శాతం పన్ను శ్లాబును రూ.40 లక్షల ఆదాయం పైబడినవారికే వర్తింపచేయాలని కోరారు.అలాగే పీఎం కిసాన్ వార్షిక చెల్లింపును రూ. 6,000 నుంచి రూ.8,000కు పెంచాలని, కనిష్ఠ వేతనాల పరిమితిని పెంచాలని సీఐఐ ప్రెసిడెంట్ కోరారు. 

క్యాపిటల్ గెయిన్స్ పన్నుల్ని సరళీకరించాలి

క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధానాన్ని సరళీకరించాలని, ఆయా ఆస్తుల రకాలు, దీర్ఘ కాలంలో వాటిని అట్టిపెట్టుకునే సమయం, ఇండెక్సేషన్ ప్రయోజనం అర్హతల ఆధారంగా రెండు లేదా మూడు క్యాటగిరీలుగా స్ట్రీమ్‌లైన్ చేయాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (ఫిక్కీ) విజ్ఞప్తి చేసింది. ఆస్తులను మూడు గ్రూప్‌లుగా ఈక్విటీ సాధనాలు, రుణ సాధనాలు, ఇతర ఆస్తులుగా వేరుచేసి, స్వల్పకాలిక, దీర్ఘకాలిక మూలధన లాభాలు రెండింటికీ నిర్దేశిత రేట్ల ను నిర్ణయించాలని సూచించింది. అలాగే దేశీ య నివాసులకు, ప్రవాస భారతీయులకు ప్ర స్తుత పన్ను వ్యత్యాసాల్ని తొలగించి, ఏకీకృత పన్ను రేట్లను అమలు చేయాలని ఫిక్కీ ప్రతిపాదించింది. వృద్ధి జోరు కొనసాగింపు, లిటి గేషన్లు తగ్గించి, వ్యాపార నిర్వహణను సులభతరం చేయాలని కోరుతున్నామని ఫిక్కీ మాజీ అధ్యక్షుడు సుబ్రకాంత్ పాండా చెప్పారు. 

ఆర్థికవేత్తలతో నిర్మల సమావేశం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రధాన ఆర్థిక వేత్తలతో తొలి ప్రి సంప్రదింపులు జరిపినట్టు ఆర్థిక శాఖ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో పోస్టు చేసింది.  ఈ కీలక సమావేశమే రానున్న పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పనకు వేదిక. ఆర్థిక వేత్తలు విలువైన ఆలోచనల్ని, సిఫార్సులను ఆర్థిక మంత్రితో పంచుకున్నారు. సమావేశంలో ఆర్థిక మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి ఎంపిపి చౌధరి, ఆర్థిక కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శులు, రెవిన్యూ, ఫైనాన్షియల్ సర్వీసులు, కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శులు, కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు సమావేశంలో పాల్గొన్నట్టు ఆర్థిక శాఖ తెలిపింది. 

పన్నులపై సూచనలు కోరిన ఆర్థిక శాఖ

ప్రత్యక్ష, పరోక్ష పన్నులు, వాణిజ్య సరళీకరణకు చట్టాల్లో చేయాల్సిన మార్పులపై సూచనలివ్వాలని  వ్యాపార, పారిశ్రామిక అసోసియేషన్లను ఆర్థిక శాఖ కోరింది. సుంకాల వ్యవస్థ, రేట్లపై చేసే సూచనలు, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల బేస్‌ను విస్త్రతం చేయడానికి వెల్లడించే ఆలోచనలు ఆర్థిక సమతౌల్యంతో ఉండాలని సూచించింది.  కస్టమ్స్, ఎక్సయిజు సుంకాల్లో మార్పులకు సంబంధించి ఉత్పత్తి, ధరలు గణాంకాలు, మార్పులతో రెవిన్యూపై పడే ప్రభావాలను వివరిస్తూ సూచనలివ్వాలని కోరింది. ప్రత్యక్ష పన్నుల విషయంలో పన్నుపై స్పష్టతనిచ్చే, లిటిగేషన్లు తగ్గించే ప్రతిపాదనలు ఇవ్వాలన్నది. పన్ను ప్రోత్సాహకాలను, మినహాయింపులను, తగ్గింపులను మధ్యకాలికంగా తొలగించాలన్నదే ప్రభుత్వ విధానమని, అయితే అదే సమయంలో పన్ను రేట్లను హేతుబద్దీకరిస్తామని ఆర్థిక శాఖ తెలిపింది.