20 June, 2026 | 7:45 PM

డిపాజిటర్లకు పన్ను ఊరటనివ్వాలి

20-06-2024 01:48 AM
  • ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా

ముంబై, జూన్ 19: డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై  పన్ను ఊరటనివ్వాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేశ్ ఖారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పన్ను ఊరటకల్పిస్తే బ్యాంక్‌లు పొదుపును డిపాజిట్ల రూపంలో సమీకరించి, దీర్ఘకాలిక ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు నిధులు ఇచ్చేందుకు ఉపయోగిస్తాయన్నారు. ప్రస్తుతం అన్ని బ్యాంక్‌లూ కలిపి వాటి శాఖల్లో డిపాజిట్లపై చెల్లించే వడ్డీ ఆదాయంలో పన్నును మినహాయించుకుని (టీసీఎస్) ఆదాయపు పన్ను శాఖకు కట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తం సంవత్సరానికి రూ. 40,000 కోట్లకుపైగా ఉంటుంది. పొదుపు ఖాతాల ద్వారా ఆర్జించే రూ. 10,000 వరకూ వడ్డీ ఆదాయంపై పన్ను మినహయింపు ఉంటుంది. అంతకు మించితే టీసీఎస్ కోత పడుతుంది. వడ్డీ రాబడులపై బడ్జెట్లో పన్ను ఊరట కల్పిస్తే, అది డిపాజిట్లకు ప్రోత్సాహకరమవుతుందని, బ్యాంక్‌లు సమీకరించిన డిపాజిట్లను దేశంలో మూలధన కల్పనకు ఉపయోగిస్తాయని ఖారా అన్నారు.

రుణ వృద్ధి 14 శాతం

ప్రస్తుత ఆర్థికాభివృద్ధి రేటు ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి 14 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నామని ఎస్బీఐ చైర్మన్ చెప్పారు. సాధారణంగా రుణ వృద్ధిని తాము జీడీపీ వృద్ధి రేటుకు ద్రవ్యోల్బణాన్ని కలిపి, ఆ సంఖ్యకు 23 శాతంపైన జోడిస్తామని, దీని ప్రకారం బ్యాంక్‌ల రుణ వృద్ధి 14 శాతం మేర ఉండవచ్చన్నారు. రుణ వితరణకు తగిన అవకాశాలు లభించడం, అవి తమ రిస్క్ సామర్థ్యానికి తగ్గట్టుగా ఉంటే 14 శాతం రుణ వృద్ధి సాధ్యపడుతుందని వివరించారు.

డిపాజిట్లకు సంబంధించి గత ఏడాది ఇవి 11 శాతం పెరిగాయని, తమకు ఎస్‌ఎల్‌ఆర్ (స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో)లో వెసులుబాటు ఉన్నందున, తమ లోన్ టూ డిపాజిట్ రేషియోకు మద్దతుగా డిపాజిట్ రేట్లను పెంచడంలో ఎటువంటి ఒత్తిడి ఏర్పడలేదని ఖారా తెలిపారు. తమ బ్యాంక్‌కు రూ.3.5 లక్షల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్ల వరకూ అధిక ఎస్‌ఎల్‌ఆర్ ఉన్నదని, ఈ కారణంగా డిపాజిట్ రేట్ల ఒత్తిడి లేకుండా రుణ వితరణకు తగిన నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవ స్వల్పకాలిక డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచామని వెల్లడించారు. ఈ ఏడాదిలో తాము డిపాజిట్ వృద్ధి రేటును పెంచుకుంటామని, కనీసం 12 శాతం వృద్ధి సాధించాలని భావిస్తున్నట్టు చెప్పారు. గత నెలలో ఎస్బీఐ కొన్ని స్వల్పకాలిక డిపాజిట్లపై 0.75 బేసిస్ పాయింట్ల వరకూ వడ్డీ రేట్లను పెంచింది.