కలగా మారిన మాతృత్వం..ప్రాణాలు విడిచిన గర్భవతి

11-09-2026 | 12:12pm

వైద్యం వికటించిందని కుటుంబ సభ్యుల ఆవేదన

గాంధీలో చికిత్స పొందుతూ కన్నుమూత 

సంతాపం తెలిపిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కోనరావుపేట సెప్టెంబర్ 11(విజయక్రాంతి ): కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామం(Kondapur Village)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.ఆరు నెలల గర్భవతి హారిక (25) హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందింది. దీంతో కొండాపూర్, కొడిమ్యాల మండలం రామకృష్ణపూర్ గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.కొండాపూర్‌కు చెందిన మల్యాల ప్రభాకర్, లక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె హారికకు ఎనిమిది నెలల క్రితం రామకృష్ణపూర్‌కు చెందిన యువకుడితో వివాహమైంది. ప్రస్తుతం ఆరు నెలల గర్భవతిగా ఉన్న ఆమె ఇటీవల వైద్య పరీక్షల కోసం సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లింది.

గర్భంలోని శిశువు ఎదుగుదల లేదని వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆమెను కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.అక్కడ శస్త్రచికిత్స చేసి శిశువును తొలగించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఆ తర్వాత హారిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు బుధవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ వంకాయల గౌతమి ప్రశాంత్ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో ఆది శ్రీనివాస్ గాంధీ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి హారికకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.అయినప్పటికీ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం హారిక మృతి చెందింది.భర్త బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశంలో ఉండగా, పెళ్లయిన ఎనిమిది నెలలకే హారిక మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హారిక మృతిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సర్పంచ్ గౌతమి ప్రశాంత్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు