బాసర ద్వాదశ జ్యోతిర్లింగ మందిరంలో వైభవంగా మాసోత్సవం
మల్కాజ్గిరి,(విజయక్రాంతి): బాసర క్షేత్రంలోని శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమం (కోటి పార్థివలింగ స్థూపం సహిత ద్వాదశ జ్యోతిర్లింగ మందిరం)లో శ్రీ వాగ్దేవి సంస్కృత భారతీ ఆధ్వర్యంలో మాసోత్సవం ఘనంగా నిర్వహించారు. దీపారాధన, కలశస్థాపన, పుణ్యాహవచనం, లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు, ద్వాదశ జ్యోతిర్లింగాలకు మహారుద్రాభిషేకం, హోమాలు, భూదాన సంకల్ప పూజ, అన్నదాన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి.
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ సాయి నటరాజ అకాడమీ వ్యవస్థాపక–అధ్యక్షులు నాట్యాచార్యులు తులసికి ఉత్తమ ఆధ్యాత్మిక సాంస్కృతిక నాట్య సేవ పురస్కారం ఆశ్రమ వ్యవస్థాపకులు శివశ్రీ నిర్మల అంబికానాథ శర్మ–సంధ్య దంపతులు అందజేశారు. అకాడమీ శిష్యుల చేసిన నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రతి నెల మూడవ ఆదివారం ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉచితంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నృత్య ప్రదర్శనలు ఇవ్వదలచిన గురువులు 9948332032ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవచ్చు.






