18-11-2025 07:58:14 PM
నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు
-భవిష్యత్తు అవసరాల కోసమే పరిరక్షణ
-భూముల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
-ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్ పూర్: శరవేగంగా విస్తరిస్తున్న పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రజల భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ భూములు కబ్జాలకు గురికాకుండా చర్యలు తీసుకోబోతున్నట్లు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. భూముల పరిరక్షణకు ప్రజలందరూ సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట రెయిన్బో మెడోస్ కాలనీలో ప్రభుత్వ భూమి వివాదంపై ఎమ్మార్వో వెంకటేశం, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కృష్ణ లతో కలిసి ఆయన మంగళవారం క్షేత్రస్థాయి పర్యటన చేశారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు, రెవెన్యూ అధికారులు, గ్రామ మాజీ ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, డెవలపర్స్ తో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్న లక్ష్యంతో ఇళ్లను కొలుగోలు చేసిన కాలనీ వాసులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు. అందరి సమక్షంలో మరోమారు జాయింట్ సర్వే నిర్వహించి పూర్తి న్యాయం చేస్తామని తెలిపారు.
రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న పటాన్చెరు నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామస్థాయి నుండి ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ భూముల వివరాలను సేకరించి.. కబ్జాలకు గురికాకుండా పూర్తిస్థాయి రక్షణ ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు, మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వ పార్కులు, రహదారులను కబ్జా చేసి.. డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తూ కొనుగోలుదారులను మోసం చేస్తే చట్టరీత్య కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు.
గజం భూమి కబ్జాకు గురైన కబ్జాదారులు జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. కొన్ని మండలాల పరిధిలో ప్రభుత్వ విద్యాసంస్థలు నెలకొల్పడానికి ప్రభుత్వ భూములు దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలు, కమ్యూనిటీ ఫంక్షన్ హల్లు, విద్యాసంస్థలు, సబ్ స్టేషన్లు, గోదాముల, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను వినియోగించబోతున్నట్లు తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని కోరారు.