ఆయిల్ పామ్ తోటల సాగుతో రైతులకు నెలసరి ఆదాయం
తుంగతుర్తి (విజయక్రాంతి): దీర్ఘ కాలం పంట అయినా ఆయిల్ పామ్ తోటలను సాగుచేసి నెల నెల ఆదాయం పొందాలని డివిజన్ ఫీల్డ్ ఆఫిసర్ అశోక్(Division Field Officer Ashok) అన్నారు. తుంగతుర్తి మండలం బండ రామరం గ్రామంలోని ఐకేపి వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద ఆయిల్ పామ్ సాగుపైన రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న అయిల్ పామ్ తోటలను సాగు చేయడం వలన రైతులు ఆర్థికoగా అభివృద్ధి చెందవచ్చు అని అన్నారు. ఆయిల్ పామ్ తోట నాటిన నాలుగవ సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది వారు తెలిపారు.
ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం బిందు సేద్యం, ఎరువులకి, అంతర పంటలకు రాయితీలు ఇస్తుందన్నారు. ఎరువులు, అంతర పంటల యాజమాన్యానికి ఒక ఎకరానికి రూ. 4200 చొప్పున మొదటి నాలుగు సంవత్సరాలు ప్రోత్సాహకం గా డబ్బులు ఇవ్వబడుతుందని చెప్పారు. నమ్మకమైన నీటి వసతి గల రైతులు లాభదాయకమైన ఆయిల్ పామ్ పంటను సాగు చేసి, అధిక ఆదాయం పొందవచ్చునని తెలిపారు. ఒక ఎకరానికి దిగుబడి పది టన్నుల వరకు వస్తుందనీ, మొదటి నాలుగు సంవత్సరాల వరకు అంతర పంటలుగా ప్రస్తుతం మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న కూరగాయలను, వాణిజ్య పంటలను సాగు చేయాలని రైతులకు వారు సూచించారు. ఆయిల్ పామ్ తోటలు సాగు చేయాలనుకున్న ఆసక్తి గల రైతులు ఉద్యాన శాఖ అధికారులకు దరఖాస్తు చేయలని కోరారు. ఈ సందర్బంగా ఆయిల్ పామ్ సాగుచేస్తున్న పలు క్షేత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర సహాయకులు ఎలగందుల రమేష్, రైతు గడ్డం సత్యనారాయణ, పలువురు రైతులు, తదితరులు పాల్గొన్నారు.




