ఆయిల్ పామ్ తోటల సాగుతో నెలసరి ఆదాయం
కృష్ణకాంత్..
నాగారం: దీర్ఘకాలం పంట అయినా ఆయిల్ పామ్ తోటలను సాగుచేసి నెలనెల ఆదాయం పొందాలని మండల వ్యవసాయ అధికారి కృష్ణకాంత్(Mandal Agriculture Officer Krishnakanth) అన్నారు. వర్ధమానుకోట రెవెన్యూ పరిధిలోని నాగారం బంగ్లా గ్రామంలో నూతనంగా ఆయిల్ పామ్ సాగు చేస్తున్న కత్తుల వెంకన్న వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ పామ్ మొక్కను నాటే కార్యక్రమంను ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న అయిల్ పామ్ తోటలను సాగు చేసినట్లు అయితే రైతులు ఆర్థికoగా అభివృద్ధి చెందవచ్చు అని అన్నారు. ఆయిల్ పామ్ తోటనాటిన నాలుగవ సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది అని తెలిపారు.
ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం బిందు సేద్యం, ఎరువులకి, అంతర పంటలకు రాయితీలు ఇస్తుందన్నారు. ఎరువులు మరియు అంతర పంటల యాజమాన్యానికి ఒక ఎకరానికి రూపాయలు 4200/- చొప్పున మొదటి నాలుగు సంవత్సరాలు ప్రోత్సాహకంగా డబ్బులు ఇవ్వబడుతుందని చెప్పారు. నమ్మకమైన నీటి వసతి గల రైతులు లాభదాయకమైన ఆయిల్ పామ్ పంటను సాగు చేసి, అధిక ఆదాయం పొందవచ్చునని తెలిపారు.
ఒక ఎకరానికి దిగుబడి పది టన్నుల వరకు వస్తుందనీ మొదటి నాలుగు సంవత్సరాల వరకు అంతర పంటలుగా ప్రస్తుతం మార్కెట్లో బాగా డిమాండ్ కూరగాయలను, వాణిజ్య పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.ఆయిల్ పామ్ తోటలు సాగు చేయాలనుకున్నఆసక్తి గల రైతులు ఉద్యాన శాఖ అధికారులకుదరఖాస్తు చేయలని కోరారు. ఈ కార్యక్రమంలో పతంజలి ఆయిల్ పామ్ కంపెనీ ఫీల్డ్ ఆఫిసర్ పి అశోక్, క్షేత్ర సహాయకులు రంగు ముత్యంరాజు తొ పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.






