9 May, 2026 | 6:36 AM

చరిత్ర రమణీయం.. బతుకేమో కడు దైన్యం

16-05-2024 12:05 AM

మన తాతలు, తండ్రులు వెట్టిచాకిరీ చేశారు. దారిద్య్రానికి చిరునామాలుగా వారి జీవితాలు గడిచాయి. నేటికీ మన పరిస్థితి మెరుగు పడింది లేదు. మన భావితరాలూ మనలాగే ఎదుగూ బొదుగూ లేని జీవితాలు గడపాలా? ఈ పరిస్థితికి మనం పౌరుషవంతులైన ముదిరాజుల్లా అడుకట్ట వేద్దామా? అచేతనుల్లా భరిద్దామా? మిన్నకుంటే ముదిరాజుల భావితరం మనలను క్షమించరు. అందుకే, రాజ్యాంగం దాఖలు పరిచిన హక్కులకు దక్కించుకునేందుకు కోటి గొంతుక లొక్కటై గర్జించాలి. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సముచిత స్థానాలకై, న్యాయబద్ధమైన వాటాకై చేయి కలపాలి. శతాబ్దాల క్రితం ముదిరాజ్‌ల చరిత్ర ఎంతో ఘనం. వారే రాజులు, వారే రాజ్యాధినేతలు. శాసనాలు చేసింది వారే, చెరగని ముద్ర వేసిందీ వారే. ఆ వైభవం నేడు కరువైంది. రెక్కలు ముక్కలు చేసుకుంటున్న ముదిరాజులకు మాత్రం జానెడు కడుపు నిండటం లేదు. ప్రజాస్వామ్య ఫలాలు ప్రజలందరికీ సమానంగా అందాలని రాజ్యాంగం ఘోషిస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. రాష్ట్రంలోని 93 బి.సి. కులాల్లో అతిపెద్ద కులంగా దాదాపు కోటీ 30 లక్షల మందికి పైగా జనాభా కలిగివున్న ముదిరాజులు నేడు దుర్భర దారిద్య్రంలో బతుకులీడుస్తున్నారు. వీరికి దక్కాల్సిన అభివృద్ధి ఫలాలు ఎవరి ఖాతాలో జమ అయినాయి? దశాబ్దాలుగా ముదిరాజుల నోటికాడ కూడు తీసి ఉసురు పోసుకున్నదెవరూ? 

రాష్ట్రంలో కోటి 30 లక్షల మందికిపైగా ముదిరాజులు అన్ని జిల్లాల్లోనూ విస్తరించి ఉన్నారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఎంతో వెనుకబడి ఉన్నారు. స్వాతంత్య్రానంతరమూ వారి జీవితాల్లో చెప్పుకోదగిన మార్పులు రాలేదు. రాష్ట్రంలో దళితుల తర్వాత అంతగా వెనుకబడి ఉన్నవారు ముదిరాజులు. రెక్కాడినా డొక్కాడని పరిస్థితుల్లోకి వారు నెట్టబడ్డారు. ఇందుకు కారణం ఒక్కటే గ్రామీణ ప్రాంతాల్లో అగ్రవర్ణాల వారు ఆర్థికంగా పట్టు కలిగే ఉండటమే. భూములు వారివి, మొత్తం గ్రామీణ భారతాన్ని వారు గుప్పెట్లో పెట్టుకున్నారు. జనబలం లేకపోయినా జబ్బబలంతో, ధనబలంతో కొద్దిమందిగా ఉన్న అగ్రవర్ణాల వారు నేడు గ్రామసీమలను శాసించగలుగుతున్నారు. ఎటువంటి ఆర్థిక వనరులూ లేని ముదిరాజులు తమ పిల్లలకు కనీస ఆహారం కూడా అందించలేని దుర్భర స్థితిలో బతుకులీడుస్తున్నారు. చదువుకునే పరిస్థితిలో వారు లేరు. ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపుతున్న వారు చాలా తక్కువ. వీరంతా పశువుల కాపర్లుగానో, పనిమనుఘలుగానో కాయకష్టం చేస్తూ కునారిల్లుతున్నారు. 

విద్యాబుద్ధులతో, ఆటపాటలతో కాలం గడపాల్పిన వారి బాల్యం బండబారి పోతోంది. కొద్దిపాటి భూములున్నవారు, చిరు వ్యాపారులు, చిన్న ఉద్యోగస్థులు తమ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న తపనతో ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పోయినా అప్పోసొప్పో చేసి చదివించగలుగుతున్నారు. తదనంతర పరిస్థితి వారిని ఆందోళనలోకి నెడుతోంది. ఉద్యోగాల కోసం వేట, విసిగిపోయి ఆ ప్రయత్నాన్ని విరమించుకొంటే బిజినెస్ కోసం పెట్టుబడికై అప్పుల వేట. ఇదీ స్థూలంగా గ్రామీణ ప్రాంత ముదిరాజుల పరిస్థితి. ఇక, పట్టణ ప్రాంత ముదిరాజులు విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొంత పురోగతి సాధించి, ఒకడుగు ముందుకు వేయగలిగారు.

రాజకీయ రంగంలోనూ ఇటీవలి కాలంలో ముదిరాజుల పాత్ర కొంతమేరకు పెరిగింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడంతో గణనీయమైన సంఖ్యలో ముదిరాజులు స్థానిక సంస్థలకు ఎన్నిక కాగలిగారు. చట్టపరంగా లభించినవి తప్ప అగ్రవర్ణాలు ఇష్టపూర్వకంగా ఇచ్చిన అవకాశాలు మాత్రం కావు. ముఖ్యంగా ముదిరాజుల మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ప్రతిష్ఠాత్వకమైన రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజాలకు గుర్తింపు లభించింది. ఇటీవలి కాలంలో ముదిరాజుల్లో పెరిగిన రాజకీయ చైతన్యానికి పై విజయాలు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రజాప్రతినిధులుగానే గాక సమర్థులైన నేతలుగాను ముదిరాజులు నిరూపించుకోగలుగుతున్నా రు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, బీఆరెస్ తదితర పార్టీలలో రాష్ట్రస్థాయి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నారు. అనేక మంది ముదిరాజులు రాజకీయ పార్టీల ప్రధాన భాధ్యతలను నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ముదిరాజుల జనాభా, వారి సమర్థతకు తగిన విధంగా చట్టసభల్లో అవకాశాలు కన్పించడం లేదు.

నిర్ణయాత్మక శక్తిగా ముదిరాజులు

తెలంగాణలోని జిల్లాలలో ముదిరాజులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, కడప, ఆంధ్రలో కృష్ణా, పశ్చిమ గోదావరి, విశాఖ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అధిక సంఖ్యలో ఉ న్నారు. 15 వేల నుంచి 40 వేలకు పైగా ఓటింగ్ కలిగిన నియోజక వర్గాలు రాష్ట్రంలో 60కి పైగా ఉన్నాయి. ఈ స్థానంలో ప్రాతినిధ్యం కల్పించేందుకు రాజకీయ పార్టీలు ముందుకు రాకపోగా జెండాలను మోసేందుకు పరిమితం చేశాయి. వారి ఓటింగ్ బలాన్ని, శక్తి సామర్థ్యాలను అంకితభావాన్ని కావాలనే విస్మరిస్తున్నాయి. అయితే, మారుతున్న పరిస్థితుల్లో ముదిరాజులు ఎవరి గుర్తింపు కోసమో దయాదక్షిణ్యాల కోసమో ఎదురు చూడటం లేదు. ‘ఓట్లు మావే - సీట్లు మావే’ అనే నినాదంతో వారు ముందుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు. తమను విస్మరించే రాజకీయ పార్టీలను నిగ్గదీసి తగిన గుణపాఠం చెప్పేందుకు అవసరమైన రాజకీయ చైతన్యాన్ని వారు సంతరించుకుంటున్నారు. విజయవాడ సభ ఇందుకు నాంది పలికింది. కడప సభతో అది మరింత ఊపందుకుంది. 2003 డిసెండర్ 20న 20 లక్షల మందితో రాష్ట్ర రాజధానిలో ముదిరాజ్ ప్రభంజనం నిర్వహించేందుకు కాసాని నాయకత్వంలో ముదిరాజ్ మహాసభ దిశానిర్దేశం చేసింది. రాజకీయంగా న్యాయ బద్ధమైన వాటా కోసం, తమ హక్కుల సాధనకై విశాల ప్రాతిపదికన ముదిరాజులను సంఘటిత పరిచేందుకు తగిన కార్యాచరణను రూపొందించింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ఎజెండాలో ముదిరాజుల సంక్షేమాన్ని చేర్చక తప్పలేదు. ఇది వారి మాటలను మభ్యపెట్టడానికా? అనేది ఆచరణలో తేలాల్సిందే. ఏదేమైనప్పటికీ ముదిరాజ్‌లను బిసి(ఎ) గ్రూపులో చేర్చాలని, జనాభా ప్రాతిపాదికన ముదిరాజులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రధానమైన డిమాండ్లతో ఆరంభమైన ఈ ఉద్యమం రాజకీయ పార్టీల దృష్టిని మరల్చగలిగే స్థాయికి చేరిందనే చెప్పాలి. రాష్ట్ర రాజకీయల్లో ముదిరాజులు కీలకమైన పాత్ర పోషించే రోజులు త్వరలో రానున్నాయనడంలో అతియోక్తి లేదు.

త్వరలో బి.సి. కులాల సమగ్ర చరిత్ర

సమాజంలో సగభాగం బీసీలు. వీరు చరిత్రకు సాక్ష్యాలు. సంఘ నిర్మాణంలో పునాదులు, మానవ వికాసానికి ఆలంబనలు. అందుకే, బీసీగా పుట్టినందుకు ప్రతి ఒక్కరూ గర్విస్తారు. వెనుకబడిన తరగతులలో 93 కులాలు ఉ న్నాయి. ఈ కులాల ఘనచరిత్రను చాటిచెప్పే పుస్తకం ఇప్పటి వరకు రాలేదు. బీసీ కులాల చరిత్రను శాశ్వతం చేసే మహాయజ్ఞానికి బీసీ మీడియా కంకణధారి అయ్యింది. ‘బీసీ కులాల సమగ్ర చరిత్ర’ పేరున ఒక అపూర్వ గ్రంథాన్ని రూపొందించి, త్వరలో బీసీ సమాజానికి కానుకగా అందించనున్నామని తెలియజేయుటకు గర్విస్తున్నాం. దీనికి పాఠకుల సలహా, సహాయ, సహకారాలు కోరుతున్నాం.

- సి.హెచ్. కృష్ణమోహన్ ముదిరాజు