9 May, 2026 | 2:55 AM

ధాన్యం కొనుగోలులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలి

09-05-2026 01:48 AM

సుజాతనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం/సుజాతనగర్, మే 8, (విజయక్రాంతి): సుజాతనగర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, కొనుగోలు ప్రక్రియపై సమగ్రంగా ఆరా తీశారు. సుజాతనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను సమగ్రంగా పరిశీలించారు.

ఔట్ పేషెంట్ విభాగం, ఇన్ పేషెంట్ విభాగం, మందుల గది, సిబ్బంది హాజరు నమోదు పత్రాలు, ఔట్ పేషెంట్ రిజిస్టర్ను పరిశీలించి రోజువారీగా నమోదవుతున్న కేసుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రక్తపరీక్షలు, ఇతర నిర్ధారణ పరీక్షల నిర్వహణ, ల్యాబ్ సేవల పరిస్థితి, పరీక్షల ఫలితాలను రోగులకు సమయానికి అందిస్తున్న విధానంపై ఆరా తీశారు. మందుల నిల్వ గదిని పరిశీలించి అందుబాటులో ఉన్న మందుల స్టాక్, అవసరమైన మందుల లభ్యత, రికార్డుల నిర్వహణను తనిఖీ చేశారు.

అనంతరం సుజాతనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ, నిల్వలు, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, రవాణా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యం, మొక్కజొన్న నిల్వల వివరాలను పరిశీలించి కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

పి.ఆర్-126 రకం ధాన్యంలో పిన్ పాయింట్ డ్యామేజ్ ఉన్నదనే కారణంతో రైస్ మిల్లర్లు ధాన్యాన్ని స్వీకరించడం లేదని రైతులు వివరించగా, దీనిపై రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతుల ధాన్యం ఎక్కడా నిల్వ ఉండకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, ఎంపీడీవో భారతి, వైద్య అధికారులు డాక్టర్ రమేష్ కొనుగోలు కేంద్రం అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.