రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి
- బండి సంజయ్ రెచ్చగొట్టడం వల్లే బీజేపీ కార్యకర్తలు కౌశిక్‌రెడ్డిపై దాడి చేశారు
- కరీంనగర్ ఘటనపై డీజీపీకి బీఆర్‌ఎస్ ఫిర్యాదు
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు. కరీంనగర్ ఘటనపై శుక్రవారం డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. వెనుకబడిన రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నదో అదే పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. నచ్చని రాజకీయ పార్టీల నేతల కార్యాలయాలపై, ఇళ్లపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశా రు.
కరీంనగర్‌లో పోలీసుల చేతగాని తనా న్ని డీజీపీకి వివరించామన్నారు. బండి సంజ య్ రెచ్చగొట్టడం వల్లే బీజేపీ కార్యకర్తలు వచ్చి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడి చేసి, చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బండి సంజయ్‌పై కేసు నమోదు చేసి, కౌశిక్‌రెడ్డికి భద్రత పెంచాలని డిమాండ్‌చేశారు. కేపీ వివేకానంద మాట్లాడుతూ బండి సంజయ్, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య ఉన్న చీకటి ఒప్పందాలు, వ్యాపారాలు అందరికీ తెలుసన్నారు.
సీఎంకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఆయనకు బండి సంజయ్ సహాయ మంత్రిగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. మీరు మాట్లాడిన భాషపై మీ భాషలోనే సమాధానం చెబితే దాడులు చేస్తారా?, కౌశిక్‌రెడ్డి ఏమి తప్పు మాట్లాడారో చెప్పాలని ప్రశ్నించారు. వచ్చేది మా ప్రభుత్వమేనని, అప్పుడు బండి సంజయ్ గుజరాత్ వెళ్లి దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.
ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్.. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాల్సింది పోయి, ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. బీహార్ సంస్కృతి తెలంగాణలో రావద్దని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాలు, సంజయ్ పాల్గొన్నారు.






