9 May, 2026 | 7:29 AM

వలసలతోనే ప్రగతికి వేగం

16-05-2024 12:10 AM

మానవాళి వలసలు అనాదిగా జరుగుతూనే ఉన్నాయి, భవిష్యత్తులో కొనసాగుతూనే ఉంటాయి. సమాజ చరిత్రలో ఇది విడదీయలేని భాగం.  ప్రాచీన కాలంలో కూడా వలసలు కొనసాగేవని చరిత్రనుబట్టి తెలుస్తోంది. నీటి వనరులు, సారవంతమైన భూములు, ఉపాధి అవకాశాలు ఉన్న ప్రాంతాలకు వేరే ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వెళ్లడం సహజం. అయితే, ఆధునిక సమాజంలో వలసలు అనేక కారణాలవల్ల జరుగుతున్నాయి. జనాభా అధికంగా ఉన్న ఆఫ్రికాలోని పేద దేశాలు, చైనా, భారత్, బంగ్లాదేశ్ లాంటి దేశాల నుంచి ఈ వలసలు ఎక్కువగా ఉంటున్నాయి.

యాభై ఏళ్లుగా పెరుగుతున్న వలసలు

గత ఐదు దశాబ్దాలుగా విదేశీ వలసలు పలు కారణాలతో క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. అనేక సందర్భాల్లో మానవ వలసలు చదువులు, ఉద్యోగ జీవనోపాధుల వేటలో సురక్షిత, క్రమబద్ధమైన, సాధారణ వాతావరణాల్లో జరుగుతూనే ఉన్నాయి. అయితే, అస్థిరత రాజ్యమేలుతున్న ప్రపంచంలో విశ్వ మానవాళి తీవ్రమైన వలస పోకడలు, పలు సవాళ్ళను ఎదుర్కొంటున్నారని తాజాగా విడుదలైన ‘ప్రపంచ వలస నివేదిక- 2024’ (వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ --2024) స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఈనెల తొలివారంలో ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్’ (ఐఓఎం) ఈ నివేదికను విడుదల చేసింది. స్విట్జర్లాండ్‌లోని జెనీవా ప్రధాన కేంద్రంగా పనిచేసే ఐఓఎంలో ప్రస్తుతం 175 దేశాలు సభ్యులుగా ఉండగా, మరో 8 దేశాలు అబ్జర్వర్ హోదాలో ఉన్నాయి. ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులతో పోల్చితే వలసదారుల పెట్టుబడులు అధికంగా ఉంటున్నాయని, ఈ వలసవాదుల చెల్లింపులతో అభివృద్ధి చెందుతున్న దేశాల స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)కి ఊపిరి పోస్తూ ప్రగతి పథంలో పయనించేలా చేస్తున్నాయని నివేదిక వివరిస్తున్నది. 2000- మధ్య కాలంలో అంతర్జాతీయ వలస చెల్లింపులు 128 బిలియన్ డాలర్ల నుంచి 831 బిలియన్ డాలర్ల వరకు 650 శాతం దాకా పెరగడాన్ని గమనించారు. మొత్తం 831 బిలియన్ డాలర్ల వలసదారుల చెల్లింపుల్లో 647 బిలియన్ డాలర్లు అల్ప, మధ్య ఆదాయ దేశాలకు చేరాయని పేర్కొన్నది.

జనాభాలో 3.6 శాతం

ప్రపంచవ్యాప్తంగా 281 మిలియన్లు అంటే 28.10 కోట్ల వలసదారులు ఉన్నారని ‘అంతర్జాతీయ వలసల సంస్థ’ (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్)- విడుదల చేసిన ‘ప్రపంచ వలస నివేదిక  2024’ స్పష్టం చేసింది. వీరిలో  దాదాపు 117 మిలియన్ల వలసదారులు పలు సంక్షోభాలు, హింసలు, విపత్తులు, యుద్ధాల లాంటి కారణాలు ఎదుర్కొంటున్న అభాగ్యులు ఉన్నట్లు తెలుస్తున్నది. వీరిలో 71.2 మిలియన్లు అంతర్గత వలసలు కాగా, 5.4 మిలియన్ల మంది శరణార్థులు ఉన్నట్లు తేలింది. వలసదారుల్లో కొందరు తమ స్వస్థలాల్లో జీవించడానికి మరోదారి కనబడక అనధికారిక, ప్రమాదకర, అక్రమ మార్గాల ద్వారాకూడా విదేశీ సరిహద్దులు దాటుతున్నట్లు తెలుస్తున్నది. వీరిలో అత్యధికులు కాంగో లాంటి ఆఫ్రికా దేశాలకు చెందిన వారే. 

వలసదారుల పెట్టుబడులతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రగతి జరిగినప్పటికీ నేడు పలు తీవ్రమైన సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నట్లు ఆ నివేదిక తెలిపింది. ప్రపంచ మానవాళిలో ప్రతి 30 మందిలో ఒక్కరు అంటే 3.6 శాతం వరకు వలసల బాటలు పడుతూ దేశ సరిహద్దులు దాటుతున్నట్లు తెలుస్తున్నది. 2000 ఏడాది వివరాల ప్రకారం 88 మిలియన్ల పురుషులు, 86 మిలియన్ల మహిళలు (51.9 : 48.1 నిష్పత్తిలో) వలసల బాటలు పట్టగా, 2020లో 146 మిలియన్ల పురుషులు, 135 మిలియన్ల మహిళలు వలసలు వెళ్లినట్లు గమనించారు. క్రమంగా స్త్రీలకన్నా  పురుషుల వలసలు పెరుగుతున్నట్లు కూడా గమనించవచ్చు. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ లాంటి చమురు నిల్వలు ఉన్న గల్ఫ్ దేశాల్లో భారత మహిళల కన్నా పురుష వలసదారులు అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

అగ్రస్థానంలో భారత్

2022 వివరాల ప్రకారం విదేశీ చెల్లింపులు లేదా పెట్టుబడుల్లో తొలి ఐదు స్థానాల్లో ఇండియా, మెక్సికో, చైనా, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్ దేశాలు చోటు దక్కించుకున్నాయి. 2022 ఏడాదిలో ఇండియాకు వలసదారులనుంచి అందిన చెల్లింపులు 111.2 బిలియన్ డాలర్లు, మెక్సికోకు 61.1 బిలియన్లు, చైనాకు 51 బిలియన్లు, ఫిలిప్పీన్స్‌కు 38 బిలియన్ డాలర్లు జరిగినట్లు నివేదిక వెల్లడించింది. వలస చెల్లింపులు వంద బిలియన్ డాలర్లు దాటిన తొలి దేశంగా భారత్ నిలిచింది. భారత్‌లోకి వలసదారుల చెల్లింపులు 2000లో 12.9 బిలియన్ డాలర్లు, 2005లో 23.6 బిలియన్లు, 2010లో 53.4 బిలియన్లు, 2015 లో 68.9 బిలియన్లు, 2020లో 83.2 బిలియన్లు, 2022లో 111.2 బిలియన్ డాలర్లు జరిగాయని తెలుస్తున్నది. 2010 నుంచి ఈ చెల్లింపులు భారీగా పెరుగుతుండడం గమనార్హం. మన దేశం నుంచి విదేశాలకు వెళ్లేవారు, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ నిపుణుల సంఖ్య   గత పది, పదిహేనేళ్లుగా భారీగా పెరుగుతుండడంతో వలస చెల్లింపులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. 

ప్రపంచ దేశాలన్నిటికంటే భారత్ నుం చే ఎక్కువ మంది విదేశాలకు వలస వెళ్లా రు.   ప్రస్తుతం మన దేశం నుంచి దాదాపు కోటీ 80 లక్షల మంది యూఏఈ, అమెరికా, సౌదీ అరేబియా దేశాల్లో ఉండగా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా లాంటి మరికొన్ని దేశాల్లో కూడా భారతీయులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.  ఇక, దేశంలో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రాలనుంచి పెద్దసంఖ్యలో ప్రజలు ఉపాధి నిమిత్తం అంతర్గతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. ఈ రాష్ట్రాలనుంచి వలసలపై వాతావరణ ప్రభావం బలంగా ఉన్నట్లు కూడా ఆ నివేదిక పేర్కొంది. 2022లో వలసదారులు అమెరికా నుంచి 79.2 బిలియన్ డాలర్లు, సౌదీ నుంచి 39.4 బిలియన్లు, స్విస్ నుంచి 31.9 బిలియన్లు, జర్మనీ నుంచి 25.6 బిలియన్ డాలర్లు విదేశాలకు పంపినట్లు ్ల తెలుస్తున్నది. 

వలసదారుల పట్ల ఆదరణ అవసరం

వలసలు ప్రపంచ మానవాళి చరిత్రలో సర్వసాధారణమని, కనుక వారి సమస్యలు అనంతమని, వారి బాధల్ని అర్థం చేసుకుంటూ ప్రపంచ దేశాలు ముందడుగు వేయాలని ఆశించడం మనందరి కర్తవ్యం. యువ మానవ వనరులు అధికంగా ఉన్న భారతంలో వలసదారుల చెల్లింపులు ఎంతో ఉపయోగపడుతున్నాయని, వారి యోగక్షేమాలు, దేశ బాధ్యతలని మరిచి పోకుండా వలసదారుల కుటుంబాలను అక్కున చేర్చుకోవాల్సి ఉంది. అభివృద్ధికి ఊతమిస్తున్న వలసదారులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేద్దాం. 

డా. బుర్ర మధుసూదన్ రెడ్డి

వ్యాసకర్త సెల్: 9949700037