‘వేస్ట్ టు కంపోస్ట్ విండ్రో’తో స్వచ్ఛ పట్టణాల దిశగా అడుగు
- గజ్వేల్-ప్రజ్ఞాపూర్లో ప్రాంతీయ స్థాయి శిక్షణ..
- మున్సిపాలిటీల అధికారులు, శానిటేషన్ సిబ్బంది హాజరు
గజ్వేల్, జూలై 9: పట్టణాల్లో రోజురోజు కూ పెరుగుతున్న ఘన వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో గురువారం ‘వే స్ట్ టు కంపోస్ట్ విండ్రో’ విధానంపై ప్రత్యేక అవగాహన, శిక్షణా కార్యక్రమం నిర్వహించా రు. సీడీఓ హేమలత పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో తడి చెత్తను శాస్త్రీయ పద్ధతిలో విండ్రో విధానం ద్వారా తక్కువ వ్యయంతో నాణ్యమైన సేంద్రీయ ఎరువుగా మార్చే ప్రక్రియను అధికారులకు, సిబ్బందికి ప్రత్యక్షంగా వివరించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన, మున్సిపల్ కమిషనర్ పి. గణేష్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక వ్యర్థాల నిర్వహణ విధానాలను ప్రతి మున్సిపాలిటీలో సమర్థంగా అమలు చేస్తే చెత్త సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి ఉపయోగకరమైన కంపోస్ట్గా మార్చడం ద్వారా స్వచ్ఛతతో పాటు ఆదాయ వనరులు కూడా పెరుగుతాయని తెలిపారు.
ఈ ప్రాంతీయ శిక్షణా కార్యక్రమంలో గజ్వేల్-ప్రజ్ఞాపూర్తో పాటు సిద్దిపేట, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్, అలియాబాద్, మూడు చింతలపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీల కమిషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటేషన్ విభాగం క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు. విండ్రో విధానంలో ఎరువు తయారీ సందర్భంగా గాలి ప్రసరణ, తేమ శాతం నిర్వహణ, నాణ్యత నియంత్రణ వంటి సాంకేతిక అంశాలపై అధికారులు అవగాహన పొందారు. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తున్న శానిటేషన్ సిబ్బంది సేవలను ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.






