10 July, 2026 | 2:53 AM

బడిబాట నమోదులో ప్రథమ స్థానంలో నిలవాలి

10-07-2026 01:59 AM

కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ 

కామారెడ్డి, జూలై 9 (విజయక్రాంతి): బడిబాట నమోదులో కామారెడ్డి జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచే విధంగా ప్రధానోపాధ్యాయులు,  ఉపాధ్యాయులు,  అధికారులు అందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్  విద్యాశాఖ అధికారులను కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో మన కామారెడ్డి జిల్లా నాలుగవ స్థానంలో నిలిచిందన్నారు. 

గత సంవత్సరం కంటే అదనంగా 10 శాతం విద్యార్థుల నమోదు  లక్ష్యాన్ని అధిగమించిన మాచారెడ్డి మండల విద్యాధికారి సురభి దేవేందర్ రావు, తాడ్వాయి మండల విద్యాధికారి రామస్వామి, కల్వరాల కాంప్లెక్స్  ప్రధానోపాధ్యాయులు విష్ణు వర్ధన్ రెడ్డి, ఎర్రాపహాడ్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సంగారెడ్డి ని కలెక్టర్  సన్మానించారు.

బడిబాటలో విద్యార్థులను నమోదు పెంపు కార్యక్రమాన్ని ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రతిష్టాత్మకంగా స్వీకరించి తమకు నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా అధిగమించాలని కలెక్టర్ కోరారు. కామారెడ్డి జిల్లాను విద్యారంగంలో ఉన్నత స్థాయిలో ఉండే విధంగా కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ ఎన్ వి గిరి,  జిల్లా విద్యాధికారి మల్లిఖార్జున్, సమగ్ర శిక్ష సమన్వయ కర్తలు నాగవేందర్, వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.