భూ యాజమాన్య హక్కులు కాపాడాలి
రైతుల ధర్నాకు ఎంపీ ఈటల మద్దతు
రూ.వెయ్యి కోట్ల కుంభకోణం: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
మేడ్చల్, ఆగస్టు 14 (విజయక్రాంతి): తమ పూర్వీకులు కొనుగోలు చేసిన భూముల యాజమాన్య హక్కులు కాపాడాలని మేడ్చల్ జిల్లా బొమ్మరాసిపేట గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం షామీర్పేట్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తహసిల్ కార్యాలయం వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. నిరసన కార్యక్రమానికి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, బిఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరై మద్దతు పలికారు.
ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బొమ్మరాసిపేటలో రూ. వెయ్యి కోట్ల కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు దొంగ డాక్యుమెంట్ లతో భూములను రైతుల వద్ద నుంచి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వజ్రష్ యాదవ్, అంజిరెడ్డి, ఉదయ్ సింహారెడ్డి, అనిల్ రెడ్డి పాత్ర ఉందని, వీరిపై పిడి ఆక్ట్ కింద కేసులు నమోదు చేసి చర్లపల్లి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.
బాధిత రైతులకు న్యాయం జరిగే వరకూ బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో పోరాడుతామని స్పష్టం చేశారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ కబ్జాదారులను జైలుకు పంపుతామన్నారు. స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఆర్ మధుకర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, మూడు చింతలపల్లి మున్సిపల్ చైర్మన్ రవి తదితరులు మద్దతు తెలిపారు. అనంతరం ఎంపీ ఈటెల రాజేందర్ వచ్చి రైతులకు మద్దతు తెలిపారు. బాధిత రైతులకు బిజెపి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రైతులు కొద్దిసేపు రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు.






