జెజ్జనకరి జనారే!
గళం విప్పుతున్న జెన్ ఆల్ఫా
- మార్పు కోసం చిన్నారుల నిరసనలు..
- జెన్ జెడ్ ఉద్యమాల ప్రభావం
హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): దేశంలోని పట్టణాలు, గ్రామాల్లో విద్యార్థి నిరసనలకు ఇప్పుడు నూతన తరం కొత్త నిర్వచనం చెబుతోంది. 2010 నుంచి 2025 మధ్య జన్మించిన వారిని సాధారణంగా జెన్ ఆల్ఫాగా పరిగణిస్తుంటారు. వీరిలో చాలామంది ఇప్పటికీ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్నవారే. తమకు అవసరమైన కనీస సౌకర్యాల కోసం పలు రాష్ట్రాల్లో వారు రోడ్డెక్కుతున్నారు.
ఉక్కపోతను తట్టుకునేందుకు తరగతి గదుల్లో ఫ్యాన్లు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, పనిచేసే తాగునీటి సౌకర్యాలు, తగినంత మంది ఉపాధ్యాయులు, పాఠశాలకు సురక్షితమై న రహదారులు, వేధింపుల నుంచి రక్షణ.. ఇవన్నీ పరిష్కరిస్తామని ప్రభుత్వాలు ఏళ్లుగా హామీ ఇస్తున్నాయి. నిజానికి ఇవన్ని ప్రాథమిక అవసరాలే. వీటికోసమే ఇప్పుడు జెన్ ఆల్ఫా తరం రోడ్డెక్కుతోంది. తమ హక్కుల కోసం వారు బయటకు వస్తున్నారు.
పరీక్షా పత్రాల లీకేజీలపై ఇటీవల జెన్ జీ చేపట్టిన ఆందోళనలు, చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన పరిణామాలు ఈ చిన్నారులపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. అదే స్ఫూర్తితో పాఠశాల విద్యార్థులు ధర్నాలు చేస్తు న్నారు. పాఠశాల గేట్లకు తాళాలు వేస్తున్నారు. రహదారులను దిగ్బంధిస్తున్నారు. కలెక్టరేట్లకు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పలుచోట్ల అధికార యంత్రాంగం కూడా స్పందించి చర్యలు చేపట్టడం గమనార్హం.
ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో ఈ నిరసనల ప్రభావం కనిపించింది. అయితే జెన్ జీ ఉద్యమాలు పోటీ పరీక్షల్లో అవకతవకలు, జాతీయ స్థాయి విధాన వైఫల్యాలపై ప్రధానంగా దృష్టి సారించగా.. జెన్ ఆల్ఫా ఆందోళనలు పూర్తిగా స్థానికమైనవి.
జూలై 28న ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లా కిషన్‌పూర్‌లోని సర్వోదయ ఇంటర్ కాలేజీలో జరిగిన నిరసన ఈ తరహా ఉద్యమాలకు ఒక ముఖ్యమైన ఉదాహరణగా చెప్పవచ్చు. 6 నుంచి 12 తరగతులకు చెందిన దాదాపు 1,500 మంది విద్యార్థులు ఐదు నుంచి ఆరు గంటలపాటు సుదీర్ఘంగా నిరసనను కొనసాగించారు. ప్రతి తరగతి గదిలో కనీసం నాలుగు ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని, దెబ్బతిన్న విద్యుత్ వైరింగ్‌ను మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు.
తాము చాలాసార్లు ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపించారు. కొన్ని ఫ్యాన్ల వల్ల విద్యుత్ షాక్‌లు కూడా తగిలాయని వారు తెలిపారు. అంబేద్కర్ చిత్రపటాలను చేతబట్టిన విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించి నిరసనకు దిగారు. జిల్లా పాఠశాలల ఇన్స్‌పెక్టర్ రాకేశ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులతో చర్చించి లిఖితపూర్వకంగా, మౌఖికంగా హామీలు ఇచ్చారు.
ఫ్యాన్లను వెంటనే ఏర్పాటు చేస్తామని, వైరింగ్‌ను మరమ్మతు చేస్తామని, నెల రోజుల్లో బెంచీలు అందిస్తామని తెలిపారు. ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన ముగిసింది. ఇలాంటి దృశ్యాలే ఇతర ప్రాంతాల్లోనూ కనిపించాయి. రాజస్థాన్‌లోని బార్మర్, జాలోర్ జిల్లాల్లో ఉపాధ్యాయుల కొరతపై విద్యార్థులు పాఠశాల గేట్లకు తాళాలు వేశారు. మొదటి, రెండో, మూడో గ్రేడ్ ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసి తరగతులు ఉపాధ్యాయులతో సాగేలా చూడాలని డిమాండ్ చేశారు.
అధికారులు వెంటనే ఉపాధ్యాయులను నియమిస్తామని హామీ ఇచ్చారు. బీహార్లోని గయా జిల్లాలో సిమువారా మిడిల్ స్కూల్‌కు చెందిన సుమారు 40 మంది విద్యార్థులు పలు కిలోమీటర్లు నడిచి.. టికారి సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ కార్యాలయానికి చేరుకున్నారు. పాఠశాలలో అపరిశుభ్రమైన మరుగుదొడ్లు, పనిచేయని చేతిపంపు, నాసిరకం మధ్యాహ్న భోజనం, క్రీడా పరికరాల కొరత వంటి సమస్యలను వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో చందూ పూర్ గ్రామపంచాయతీకి చెందిన విద్యార్థులు, గ్రామస్థులు ఆగస్టు 11న సుమారు ఐదు కిలోమీటర్లు ‘తిరంగా యాత్ర’ నిర్వహించి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి తమ పాఠశాలకు సరైన రహదారి లేదని, పక్కా రహదారి నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లా పటాన్‌లోని సందీపని విద్యాలయ విద్యార్థులు కూడా రోడ్డెక్కారు. పాఠశాలను సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని సక్రా గ్రామానికి తరలించడాన్ని వారు వ్యతిరేకించారు. అంత దూరం ప్రయాణించడం వల్ల తాము అలసిపోతున్నామని, చదువులు దెబ్బతింటున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన చేస్తే బదిలీ సర్టిఫికెట్లు ఇస్తామని, పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని కొందరు ఉపాధ్యాయులు బెదిరించారని వారు ఆరోపించారు.
దీనితో పటాన్ రహదారిని దిగ్బంధించారు. తమకు క్రమబద్ధమైన బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థినుల భద్రత కూడా కీలక అంశంగా ముందుకొచ్చింది. రాజస్థాన్లోని ఓ ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో విద్యార్థినులు ఉపాధ్యాయుడు నరేశ్ కుమార్ జై తమను అనుచితంగా తాకుతున్నారని, అసభ్యంగా ప్రవర్తిన్నాడంటూ ఆరోపణలు చేశారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని వారు పేర్కొన్నారు.
దీంతో విద్యార్థులు రోడ్డును దిగ్బంధించి, చక్కా జామ్ నిర్వహించి, ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మేము అమ్మాయిలం కాబట్టి మా గొంతును అణచివేస్తారా? అంటూ వారు ప్రశ్నించారు. అధికారులు జోక్యం చేసుకున్నారు. ఇదే సమయంలో అజ్మీర్‌లోనూ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఉపాధ్యాయుడిని విద్యార్థులు పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన అనంతరం సస్పెండ్ చేశారు.
జైపూర్‌లో బధిరులు రోడ్డెక్కారు. తమ బధిరుల పాఠశాలలో కనీస వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జార్ఖండ్‌లోని గఢ్వా జిల్లాలో కాండీ ప్రభుత్వ ప్లస్ టూ హైస్కూల్‌కు చెందిన 10 నుంచి 13 ఏండ్లున్న విద్యార్థులు.. తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మలయ్ కుమార్ సింగ్ బదిలీని వ్యతిరేకిస్తూ దాదాపు ఏడు గంటలపాటు రహదారిని దిగ్బంధించారు.
తీవ్ర నిరసనల అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి బదిలీ ఉత్తర్వులను రద్దు చేసి, ఆయనను డిప్యూటేషన్‌పై కొనసాగించేందుకు అనుమతించారు. ఉత్తరాఖండ్‌లోని ఖతిమాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆహార నాణ్యత, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య సమస్యలపై మూడు రోజులపాటు జరిగిన నిరసనకు తలొగ్గి.. చివరికి ప్రధానోపాధ్యాయుడిని తొలగించి, అధికారిక విచారణకు ఆదేశించారు.
ఫతేపూర్, బార్మర్ తదితర ప్రాంతాల్లోనూ తనిఖీలు, ఫ్యాన్లు, నీటి వ్యవస్థల ఏర్పాటుకు గడువులు, తాత్కాలిక ఉపాధ్యాయ నియామకాలు వంటి చర్యలు చేపట్టారు. ఇక్కడ ఒక అంశాన్ని ప్రస్తావించాల్సిన అవసరం కనపడుతోంది. జెన్ ఆల్ఫా.. జెన్ జీ ఉద్యమాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. నీట్ అక్రమాలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో నిరసనలు చివరకు ఒక ప్రముఖుడి రాజీనామాకు, విధానపరమైన హామీలకు దారితీశాయి.
అసలు పరీక్ష..
అయితే అసలు పరీక్ష ఇక్కడి నుంచే మొదలవుతుంది. దేశంలోని అనేక ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికీ నిధుల కొరత, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు, ఆలస్యమవుతున్న మరమ్మతులు వంటి సమస్యలతో సతమతమవుతున్నాయి. త్వరలో చేస్తాం, నెల రోజుల్లో పూర్తి చేస్తాం అనే హామీలు శాశ్వత పరిష్కారాలుగా మారుతాయా? అన్నదే కీలక ప్రశ్న. కొన్ని నిరసనలకు పెద్దల సహకారం, రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని ఉపయోగించుకునే ప్రయత్నాలు ఇందులో ఉన్నాయా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అయినప్పటికీ పరిశుభ్రత, ఉపాధ్యాయులు, భద్రత, విద్యకు అవసరమైన కనీస సౌకర్యాలు వంటి వారి డిమాండ్లు మాత్రం ప్రాథమికమైనవి, న్యాయమైనవికూడా. అదే సమయంలో.. నిరసనల్లో చిన్నారుల భద్రత, వారిపై ప్రతీకార చర్యల ముప్పు, వారి చదువులకు కలిగే అంతరాయం వంటి అంశాలను అధికారులు అత్యంత జాగ్రత్తగా పరిగణించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలోని చిన్నారులు ఇక తమకు అందించిన సౌకర్యాలతోనే సరిపెట్టుకుంటూ.. నిశ్శబ్దంగా ఉండటం లేదు.
తమకు హక్కుగా దక్కాల్సిన చక్కటి విద్యా వాతావరణాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది కొన్ని స్థానిక విజయాలకే పరిమితమవుతుందా? లేక పాఠశాలల మౌలిక వసతులు, ఉపాధ్యాయుల కొరత, అధికారుల జవాబుదారీతనం వంటి అంశాలపై నిరంతర వ్యవస్థాగత సంస్కరణలకు దారితీస్తుందా? అన్నది ఇక ఆయా రాష్ట్రాల విద్యాశాఖలు తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుంది.
జెన్ ఆల్ఫా
‘మీకు పిల్లలు ఉంటే.. వారికి ఇదే సౌకర్యాలు ఇస్తారా?’
ఓ చిన్నారి వేసిన ఈ ప్రశ్న ఇప్పుడు మొత్తం వ్యవస్థనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది.
విరిగిపోయిన పాఠశాల రెయిలింగ్‌లు.. శిథిలావస్థకు చేరిన భవనాలు.. ఏ క్షణంలోనైనా ప్రమాదం సంభవించే పరిస్థితులు.. ఓ చిన్నారి ప్రాణం పోయే వరకు ఎవరైనా ఎదురుచూస్తున్నారా?
థానరాజ్, జోధావాస్, అల్వార్,
ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్






